వైసీపీని గురి చూసి కొడుతున్న పురంధేశ్వరి: జగన్ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా? ఇప్పటి వరకు వైసీపీ తనను టార్గెట్ చేయడంతో ఘాటుగా కౌంటర్ ఇచ్చేందుకు పురంధేశ్వరి రెడీ అవుతున్నారా?
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా? ఇప్పటి వరకు వైసీపీ తనను టార్గెట్ చేయడంతో ఘాటుగా కౌంటర్ ఇచ్చేందుకు పురంధేశ్వరి రెడీ అవుతున్నారా? బీజేపీ అధ్యక్షురాలునైన తనను టీడీపీ మనిషినంటూ ఆరోపణలు చేయడంపై రివేంజ్ తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారా? ఎన్నికల వేళ వైసీపీని గురి చూసి దెబ్బకొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం అందులో కారణమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. ఆమె బీజేపీ అధ్యక్షురాలు కాదని టీడీపీ అధ్యక్షురాలు అని విమర్శలు చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడును బయటకు తీసుకువచ్చేందుకు లోకేశ్‌తో కలిసి హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిశారంటూ ఆరోపణలు చేసింది వైసీపీ. ఇందుకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇవ్వలేదు. దీంతో ఇక విమర్శల దాడిని మరింత పెంచింది. ఇప్పటి వరకు ఓర్పుతో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి గురి చూసి కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీకి షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే అందులో భాగంగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఆర్థిక స్థితి, కార్పొరేషన్లు, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి సంస్థల తీవ్ర ఆర్థిక మోసాలపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు లేఖ అందజేశారు.
అప్పుల కుప్పలగా రాష్ట్రం
రాష్ట్ర బిజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈనెల 23న విజయవాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్‌కి దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడంతోపాటు శ్వేత పత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల పైన, ముఖ్యంగా బెవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థల తీవ్ర ఆర్థిక మోసాలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై గతంలో జూలై 26న తాను తమ దృష్టికి తీసుకువచ్చానని అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. ఈ ఏడాది జూలై వరకు వైసీపీ ప్రభుత్వం 10.77 లక్షల కోట్లు అప్పులు చేసిందని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మెుత్తం రాష్ట్ర అప్పుల పైన అడిగిన ప్రశ్నకు జవాబుగా కేవలం ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ.4.42 లక్షల కోట్ల అప్పులను మాత్రమే చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహ చేసిన ఇతర అప్పులను చెప్పలేదు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో ఇచ్చిన ఈ సమాధానంను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా, లక్షలాది వలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని తిప్పలు నుండి బయట వేయలనే రాష్ట్ర బీజేపీ ప్రయత్నాలను తప్పుగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల నిర్వహణ పైన, కార్పోరేషన్ల రుణాలపైన, ఆస్తుల తనఖా పెట్టి తెచ్చిన అప్పులు మరియు ఇతర సావరీన్ గ్యారంటీలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి పైన ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చాలవరకు వినియోగించుకున్న కాంట్రాక్టర్లకు, సేవలకు, సప్లయర్లకు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల పైన చెల్లించాల్సిన బాధ్యతకు సంబంధించి కోర్టుల నుండి ఆదేశాలున్నా కూడా గత నాలుగు సంవత్సరాలుగా చెల్లింపులు చేయలేని ఫిర్యాదులో ఆరోపించారు. రాష్ట్రంలో మున్సిపల్ పన్ను లేదా బిల్లు, ఆస్థి పన్ను , విద్యుత్ బిల్లులు, రాష్ట్ర పన్నులు ఆలస్యంగా కడితే 18% అదనంగా వసూళ్లు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం సకాలంలో చెల్లించని బకాయిలకు ఎందుకు అదే శాతం వడ్డి కట్టరు అని రాష్ట్రంలోని వర్తక వాణిజ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎవరైన ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు అని పురంధేశ్వరి లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులు సకాలంలో చెయ్యకపోవడం వల్ల పెద్ద ఎత్తున బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోయి ఏన్పీఏ లు పెరిగిపోతున్నాయి అనే విషయం గ్రహించాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి లేఖలో తెలిపారు.
అస్తవ్యస్థంగా బడ్జెట్, అకౌంటింగ్ విధానం
ప్రస్తుతం ఏడాదికి ఏపీ సొంత ఆదాయం రూ.90 వేల కోట్లు, కేంద్ర పన్నులలో వాట రూ.35 వేల కోట్లు, మొత్తం ఆదాయం దాదాపు 1 లక్ష 35 వేల కోట్ల రూపాయలు అని దగ్గుబాటి పురంధేశ్వరి లేఖలో వివరించారు. అలాగే బడ్జెట్ ప్రకారం రాష్ట్రం వ్యయం 2.60 లక్షల కోట్ల రూపాయలు అంటే మిగిలిన 1.25 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఏఫ్ఆర్బీఏం పరిధిలో ఆర్బీఐ నుండి అప్పులు మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల అప్పుల ద్వారా పక్కకు మల్లించిన నిధులు ద్వారా సమకూర్చుకోవడం జరుగుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కేవలం 90 వేల కోట్ల రూపాయల మాత్రమే అయినప్పుడు ఎలా ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయగలుగుతుంది అని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్ మరియు అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉందని పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం నెత్తిన ఉన్న మెుత్తం అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు అయితే సగటున ఏడాదికి 8% వడ్డీ అనుకున్నా కూడా వడ్డీ మాత్రమే 88 వేల కోట్ల రూపాయలు అవుతుంది అని పురంధేశ్వరి అన్నారు. ఈ అప్పు రాబోయే 30 ఏళ్లలో తీర్చాలన్నా సంవత్సరానికి కనీసం 36 వేల కోట్లు అవసరం అని పురంధేశ్వరి తెలిపారు.
ఆర్థిక క్రమశిక్షపాటించేలా చర్యలు తీసుకోండి
కాంట్రాక్టర్లకు మరియు సప్లైయర్లకు చెల్లించాల్సిన మెుత్తం సకాలంలో చెల్లిస్తే... రాష్ట్ర ప్రభుత్వం తక్కువలో తక్కువ ప్రతి సంవత్సరం 1.24 లక్షల కోట్ల రూపాయలను అసలు అప్పు మరియు వడ్డీ క్రింద కట్టాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే...భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ అసాధ్యమన్నారు. మరోవైపు ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ ద్వారా ప్రతి రోజు ఒక కోటి మంది సగటున 200 రూపాయల చొప్పున నాణ్యత లేని చీప్ లిక్కర్ త్రాగడం ద్వార ఆర్థికంగా కుటుంబాలు చితికిపోవడమే కాక వారి ఆరోగ్యం కూడా గుల్ల అవుతుంది అని అన్నారు. దీంతో పాటు మద్యం ద్వారా సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లెక్కలోకి రాకుండ పక్కకు మల్లిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు అన్ని మద్యం ఉత్పత్తి కంపెనీలు మరియు సప్లై రాష్ట్రంలోని పాలక పక్షం అస్మదీయుల చేతుల్లో ఉన్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. నిజాన్ని నిగ్గు తేల్చడం కోసం రాష్ట్రంలోని అన్ని డిస్టలరీల పైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వార విచారణ అవసరం అని పురంధేశ్వరి అన్నారు. అన్ని రకాల సావనీర్ గ్యారంటీలను, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఏఫ్ఆర్భీఏం పరిధిలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. పైన తెలిపిన అవకతవకల పైన విచారణ జరిపి రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించే చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలకుండా భవిష్యత్ తరాలను కాపాడాలి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.