కన్నీళ్లు తెప్పిస్తున్న జగనన్న కాలనీలు...
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడతగా 2019లో 48, 349 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది రాష్ట్ర.... Public serious over Jagananna Colonies
దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడతగా 2019లో 48, 349 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 3,699 గ్రౌండింగ్ అయ్యాయి. అందులో 10,820 ఇళ్లు మాత్రమే పునాది స్థాయి, పునాది కంటే కొంత పై స్థాయికి చేరాయి. మిగిలినవన్నీ పునాది స్థాయిలోనే ఉన్నాయి. 4,862 ఇళ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటివరకు 1,271 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అయిన ఇళ్లలో 2.90 శాతం ఇళ్ల మాత్రమే పూర్తయ్యాయి. 2,94 మంది లబ్ధిదారులు తాము ఇళ్లు నిర్మించికోలేమని తేల్చి చెప్పేశారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జగనన్న కాలనీ లబ్ధిదారులకు అందిస్తోంది. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఉగాదికి ఇళ్ల నిర్మాణ ప్రారంభం బూటకంగానే కనిపిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చేది కొంతే ..
ప్రభుత్వం ఒక్కో గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తుంది. అందులో మెటీరియల్ పరంగా పునాది నుంచి బేస్ లెవెల్ కోసం 2 ట్రాక్టర్ల ఇసుక, 40 బస్తాల సిమెంట్, కడ్డీలు, బిల్లు ఇస్తుంది. ఇలా అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ వరకు మరికొంత మెటీరియల్, రూ. 40 వేలు, స్లాబ్ తర్వాత మరో రూ.30 వేలు ఇస్తుంది. ఈ లెక్కన లబ్ధిదారుడికి రూ.80 వేల మెటీరియల్ అందజేసి రూ. లక్ష నగదు రూపంలో బిల్లులు మంజూరు చేస్తుంది. ఇచ్చే బిల్లులను కూడా అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి చేసి మరీ బిల్లులు నిలిపివేస్తున్నారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
ఒక్కో ఇంటికి రూ.8 లక్షలపైనే..
ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటున్నర భూమిలో ఒక ఇళ్లు నిర్మించుకునేందుకు దాదాపు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలు అవుతుంది. భవన నిర్మాణ రంగ కార్మికులు ప్లాస్టింగ్ చేయకుండా రూ.2.80 లక్షల నుంచి రూ.3 లక్షలు తీసుకుంటున్నారు. ఇక కడ్డీలు, సిమెంట్, ఇసుక, మిల్లర్, కంకర, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఇలా ఇళ్లు పూర్తయ్యే సరికి దాదాపు రూ. 8 లక్షలు ఖర్చవుతుంది.
కనిపించని మౌలిక వసతులు
కర్నూలు నగరంలో ఇప్పటికీ పేదలకు పట్టాల్సిన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేదు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13 వేల మందికి 2007లో ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్-2 కింద జగన్నాథ గట్టు వద్ద పట్టాలిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు ఫేజ్-3 కింద 2008లో పందిపాడు వద్ద 2 ఎకరాలను కొనుగోలు చేసి 2,500 మంది లబ్ధిదారులకిచ్చారు. ఆ రెండు ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ప్రభుత్వం విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక వనరులు కల్పించలేదు. దీంతో 10 శాతం లబ్ధిదారులు కూడా ఆ ప్రాంతాల్లో గృహాలను నిర్మించుకోలేదు. దీనికి తోడు ఒరిజినల్ పట్టాలు హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఉండిపోవడంతో వారికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు కూడా లేకుండా పోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతాల వైపు దృష్టి సారించకపోవడంతో లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోని రుద్రవరంలో పట్టాల్విడం పట్ల కూడా లబ్ధిదారుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.