Ap News: పవన్ రాజకీయ వ్యవహారశైలిపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యహారశైలిపై సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు....
దిశ, డైనమిక్ బ్యూరో: వారాహి విజయ యాత్రలో మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించకపోతే తన పేరు పవన్ కల్యాణ్ కాదని శపథాలు చేశారు. ఇదే తరుణంలో దమ్ముంటే తనపై పోటీ చేసి గెలుపొందాలని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇంతలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రంగ ప్రవేశం చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ వ్యహారశైలిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
నిర్మాత నట్టి కుమార్ స్పందన ఇదే..
తాజాగా ఈ అంశంపై సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహర శైలిని తప్పుబట్టారు. కాకినాడలో తాను తలచుకుంటే జనసేన జెండా కూడా కట్టనీయనంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఇది ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనం కాదా అని నిలదీశారు. పవన్ కల్యాణ్‌ను కాకినాడలో అడుగుపెట్టనీయననడం చాలా తప్పు అని మండిపడ్డారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.
ముద్రగడ ఎందుకు వచ్చారో!
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ పోరు నడుస్తుంటే మధ్యలో ముద్రగడ పద్మ నాభం ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను ముద్రగడ పద్మనాభంను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నిలదీశారు. కాపు నాయకుడు అయిన పవన్ కల్యాణ్‌ను ముద్రగడ పద్మనాభం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎంచుకున్న మార్గం సరైనదేనని సమర్థించారు. ఏపీ ప్రజలు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలవాలని నట్టికుమార్ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో వైసీపీకి అనుకూలం
కాగా ఒకప్పుడు పవన్ కల్యాణ్‌పై నట్టికుమార్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు గత ఎన్నికల్లో నట్టికుమార్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అంశాల్లో పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం నట్టికుమార్ రూట్ మార్చారు. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. పవన్ కల్యాన్ తన రెమ్యునరేషన్ ప్రకటించడంపై కోట శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావుపైనా నట్టి కుమార్ మండిపడ్డారు.