సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లండి.. తోట చంద్రశేఖర్‌కు Priyanka Dandi వినతి పత్రం

బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌ ఆయన నివాసంలో ఉత్తరాంధ్ర పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి కలిశారు..

Update: 2023-02-24 13:55 GMT

దిశ, ఉత్తరాంధ్ర: బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌ ఆయన నివాసంలో ఉత్తరాంధ్ర పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా 740 రోజులకు పైబడి కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఈ సమస్యపై బీఆర్ఎస్ తరఫున తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై పోరాడటం చేయడంలో వెనకడుగు వేస్తోందని, స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ వైఖరి నష్టం చేకూర్చేలా ఉందని ప్రియాంక ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కి కష్టం వస్తే తాను అండగా ఉంటానని పలు సందర్భాలలో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారని ప్రియాంక గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ ఎంపీలతో పార్లమెంట్‌లో పోరాటం చేయిస్తానని అన్నారని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, నిర్వాసితులకు ద్రోహం చేస్తున్నాయని, ఇప్పుడు సమయం వచ్చిందని, అందుకే బీఆర్ఎస్ సహాయాన్ని కోరుతున్నామని ప్రియాంక దండి పేర్కొన్నారు. .

భూములు కొట్టేసేందుకు కుట్ర

32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసి లక్షల కోట్ల విలువ చేసే భూములను చౌకగా కొట్టేయాలని చూస్తున్నారని ప్రియాంక దండి ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌కి సొంతంగా గనులు కేటాయించకపోయినా కార్మికులు కష్టపడి పని చేసి లాభాల్లో నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. కేంద్రం కేవలం 5 వేల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని, స్టీల్ ప్లాంట్ కార్మికులు తిరిగి 50 వేల కోట్లు పన్ను రూపంలో కేంద్రానికి ఇచ్చారని ఆమె వివరించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి దేశంలో వ్యతిరేకంగా గళమెత్తిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అని ప్రియాంక దండి కొనియాడారు. తెలంగాణలో సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ప్రణాళిక చేస్తే కేసీఆర్‌కి బయపడి వెనక్కి తగ్గిందని చెప్పారు. స్వయంగా ప్రధాని మోదీ హైదరాబాద్ సాక్షిగా సింగరేణిని ప్రైవేట్‌పరం చేయమని ప్రకటించారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కూడా కేసీఆర్ అండగా నిలిస్తే కేంద్రం వెనక్కి తగ్గుతుందని తోట చంద్రశేఖర్‌ను ప్రియాంక దండి కోరారు. ఈ సందర్బంగా వినతిపత్రం అందజేశారు.

పార్లమెంట్‌లో పోరాడతాం

తోట చంద్రశేఖర్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో తమ ఎంపీలతో పోరాడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కోరితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నారు. అలాగే కేసీఆర్‌ను విశాఖపట్నం తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు పోరాడతారని భరోసా ఇచ్చారు. కార్మికులు కోరితే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేసి పోరాడతామని తోట చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News