జైలులో ఖైదీ మృతి.. చంద్రబాబు భద్రతపై ఆందోళన: జైళ్ల శాఖ డీఐజీ ఏమన్నారంటే!

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందడం ప్రకంపనలు సృష్టించింది.

Update: 2023-09-21 08:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందడం ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు సైతం ఉన్నారు. అయితే సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే జైల్లోనే చంద్రబాబు నాయుడును హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబునూ దోమలతో కుట్టించి హత్య చేసేలా సైకో సీఎం వైఎస్ జగన్ కుతంత్రాలు అమలు చేస్తున్నారు అని ఆరోపించారు. దీంతో జైలులో చంద్రబాబు నాయుడు భ్రదతపై టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశం సంచలనంగా మారింది. అయితే ఈ ఇష్యూపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ దోపిడీ కేసులో అరెస్ట్ అయినట్లు రవికిరణ్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు చెప్పుకొచ్చారు. అయితే జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ఈ నెల 7న ఆస్పత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చారు. అయితే వైద్యపరీక్షల్లో డెంగ్యూగా నిర్ధారణ అయ్యిందన్నారు. డెంగ్యూతో బాధపడుతూ సత్యనారాయణ మృతిచెందాడని తెలిపారు. ఈ మృతిపై నారా లోకేశ్ చేసిన ఆరోపణలపైనా స్పందించారు. జైలులో దోమల లార్వా అనవాళ్లు ఏమి లేవని వివరణ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఇచ్చారు.

Tags:    

Similar News