Ap News: దర్శి వైసీపీలో గందరగోళం.. అయినా ఆయనకే బాధ్యతలు!
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలే. వైఎస్గాలి వీచిన 2004లో కాంగ్రెస్, టీడీపీలను స్వతంత్ర అభ్యర్థిగా స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి మట్టి కరిపించారు. ....
దిశ, దక్షిణ కోస్తా: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలే. వైఎస్గాలి వీచిన 2004లో కాంగ్రెస్, టీడీపీలను స్వతంత్ర అభ్యర్థిగా స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి మట్టి కరిపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థిగా బూచేపల్లి కుమారుడు శివప్రసాదరెడ్డి ఎన్నికయ్యారు. 2014లో అనూహ్యంగా వైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చిన శిద్దా రాఘవరావు టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో బూచేపల్లి కుటుంబం సమస్యల వల్ల వెనక్కి తగ్గింది. మంత్రి శిద్దా రాఘవరావు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును టీడీపీ బరిలోకి దించింది. అయినా జగన్ఛరిష్మా దెబ్బకు మద్దిశెట్టి వేణుగోపాల్ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా చాలా సామాజిక వర్గాల నేతలను దర్శి నియోజకవర్గ ప్రజలు ఆదరించారు.
నాలుగేళ్లలో సంక్షేమంపైనే దృష్టి
గడచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించింది. మిగతా సదుపాయాలను గాలికొదిలేసింది. అన్ని శాఖల నిధులు సంక్షేమానికే పెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్మించారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పనులను చేశారు. అయితే వాళ్లకు ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేదు. ఇదే సమస్య దర్శి నియోజకవర్గంలోనూ తలెత్తింది. పనులు చేసిన కార్యకర్తలు అప్పులు పాలై ప్రజలకు మొహం చాటేసే దుస్థితి దాపురించింది.
దీనిపై ఎమ్మెల్యే మద్దిశెట్టి పార్టీ జిల్లా ప్లీనరీలో నిర్మొహమాటంగా చెప్పారు. అప్పటినుంచి ఆయనకు పార్టీ పెద్ద తలకాయల మధ్య దూరం పెరిగింది. సీఎం జగన్ చీమకుర్తి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదు. దీంతో మద్దిశెట్టి నియోజకవర్గానికి ఏదో చుట్టుపుచూపుగా వచ్చి వెళ్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆయన సామాజిక వర్గం కార్యకర్తలకు ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికలకు మద్దిశెట్టి పార్టీ మారే అవకాశాలున్నట్లు టాక్వినిపిస్తోంది.
ఎమ్మెల్యే మద్దిశెట్టికి, పార్టీ పెదల మధ్య కొనసాగుతున్న గ్యాప్
ఎమ్మెల్యే మద్దిశెట్టికి పార్టీ పెదల మధ్య గ్యాప్ కొనసాగుతుండగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నాయకులతోపాటు ఇతర సామాజిక వర్గాల కార్యకర్తలతో నిరంతరం మమేకమవుతున్నారు. త్వరలో ఆయనకు ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రధానంగా రెడ్డి సామాజిక ఓటర్లదే హవా. తర్వాత స్థానంలో కమ్మ, ఆ తర్వాత కాపు సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ.
ఇక్కడ ఒక్క బూచేపల్లి సుబ్బారెడ్డి విషయంలో తప్ప నాయకులకు అతీతంగా పార్టీలకే ఓటర్లు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈక్రమంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి టీడీపీ లేదా జనసేన అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నట్లు కాపు సామాజిక వర్గాల్లో వినిపిస్తోంది.
దర్శి నుంచి శిద్దా రాఘవరావు పోటీ చేసే అవకాశం
మరోవైపు మాజీమంత్రి శిద్దా రాఘవరావు గత ఎన్నికల తర్వాత టీడీపీని వదిలేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు వివిధ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా వైశ్యుల కోటాలో దర్శి నుంచి పోటీ చేసే అవకాశం తమ కుటుంబానికి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరులో సిట్టింగ్ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వైసీపీ టిక్కెట్నిరాకరిస్తే దర్శి సీటు కేటాయించవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అక్కడ నుంచి శిద్దా తనయుడు సుధీర్పోటీ చేయాలని భావిస్తున్నారట. కనిగిరిలో సిట్టింగ్ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌కు టిక్కెట్ఇవ్వకుంటే బూచేపల్లి శివప్రసాదరెడ్డిని కనిగిరికి పంపే అవకాశాన్ని పరిశీలిస్తారని కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఏ పరిణామాలు చోటుచేసుకున్నా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం మద్దతు లేకుండా అధికార పార్టీ విజయం సాధించడం కష్టం. అందుకే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈదఫా ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకే ఇప్పటి నుంచే జిల్లాలో దర్శి నియోజకవర్గంపై చర్చలు ఊపందుకుంటున్నాయి