Pawan Kalyan:పదవులు నాకు అలంకరణ కాదు..బాధ్యత:డిప్యూటీ సీఎం పవన్

దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Update: 2024-08-23 07:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరావారి పల్లెలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలని పవన్ అన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి వెళ్లారని తెలిపారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్నారు. పదవులు నాకు అలంకరణ కాదు..బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీలో కుప్పకూలిన పంచాయతీరాజ్‌ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై మొట్టమొదటి దృష్టి సారించింది. గ్రామాల్లో స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్థుల సమష్టి నిర్ణయం ఉండాలి. దానికి మూలం గ్రామ సభలు అని తెలియజేశారు. అవి మొక్కుబడిగా కాకుండా వాస్తవంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే ప్రజల మనోభావాలను పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం కూడా గ్రామ సభలను బలోపేతం చేసేందుకు నిర్ణయ్‌ అనే పోర్టల్‌ను ఏర్పాటుచేసింది. ప్రజల భాగస్వామ్యం కల్పించడం, పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా గ్రామ సభలు నిర్వహించేందుకు పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈక్రమంలో ‘మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం’ అనేలా వీటి నిర్వహణ ఉంటుంది’ అని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News