Andhra Pradesh : పొలిటికల్ ‘వ్యూహం’ : ట్విటర్‌లో ఆర్జీవీ వర్సెస్ టీడీపీ
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని టీడీపీ టార్గెట్ చేసిందా?
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని టీడీపీ టార్గెట్ చేసిందా? వైఎస్ జగన్ అభిమానిని అని ఇప్పటికే ప్రకటించుకున్న ఆర్జీవీ వ్యూహం సినిమాను తెరకెక్కించడం టీడీపీకి నచ్చడం లేదా? ఇప్పటికే వ్యూహం ట్రైలర్‌లో చంద్రబాబు నాయుడు పాత్రను కూడా చూపించడంపై టీడీపీ ఆగ్రహంగా ఉందా? ఇది మనసులో పెట్టుకునే టీడీపీ ఆర్జీవీపై తీవ్ర విమర్శలు చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆర్జీవీకి తెలుగుదేశం పార్టీకి అసలు పొసగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల నాటి నుంచి టీడీపీని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశారు. ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపేలా సినిమాలు తీసి మరీ దెబ్బ కొట్టారు. అనంతరం పలు అంశాలను ఆసరాగా చేసుకుని అటు చంద్రబాబు ఇటు లోకేశ్‌తోపాటు పలువురు నేతలను ట్విటర్ వేదికగా టార్గెట్ చేసుకుని విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్జీవీ వైసీపీకి అనుకూలంగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద వ్యూహం సినిమా షూటింగ్ చేయడాన్ని టీడీపీ భగ్గుమంటుంది. దమ్ముంటే ఆర్జీవీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. దీంతో వర్మ ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వర్మ వ్యూహం వైపు యూ టర్న్ తీసుకుంది.
ఆర్జీవీ దుర్మార్గుడన్న దేవినేని ఉమా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలు వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహించడం, వైఎస్ వివేకా హత్య వంటి ఇతివృత్తాలతో ఆర్జీవీ వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా ఈ సినిమాను తెరక్కెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ విజయవాడలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ‘వ్యూహం’ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ షూటింగ్‌పై మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మకి దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద సినిమా తీయాలని ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు ‘ఆర్జీవి దుర్మార్గుడు, ఓ దగుల్బాజీ.. ఆర్జీవికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా’ అంటూ ఆదివారం తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. వైసీపీ పట్టిసీమ దండగ అంటూ ప్రచారం చేసిందని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడ సినిమా తీస్తారని నిలదీశారు.
‘ఉమా..మ్…’అంటూ వర్మ ట్వీట్
మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మిక్కీమౌస్‌తో ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ… దానికి దేవినేని ఉమాను ‘ఉమా..మ్…’ అంటూ ట్యాగ్ చేశాడు. అంతేకాదు చివర్లో ఓ కిస్ ఎమోజిని వదిలాడు. ఈ ట్వీట్‌ను చూసిన టీడీపీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. వర్మపై బూతుపురాణంతో ట్విటర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. అటు దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా వర్మకు ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.‘బురదలో ఉన్న పందిబొమ్మను షేర్ చేస్తూ దాన్ని ఆర్జీవి అంటూ పోస్ట్ చేశారు. అక్కడితో ఆగిపోలేదు ‘హాయ్ రాంగోపాల్ కర్మయ’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆర్జీవీ, టీడీపీల మధ్య మరోసారి ట్విటర్ వార్ హోరెత్తిస్తోంది.
ఆర్జీవీకి కొత్తేమీ కాదు
తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకుపడటం ఆర్జీవీకి ఇదేమీ కొత్తేమీ కాదు. ఎవరూ గెలుక్కోకపోయినా ఆర్జీవీ ట్వీట్ చేసి మరీ రెచ్చగొడతారు. చంద్రబాబు, లోకేశ్‌లపై అయితే ఏదో ఒక ట్వీట్ చేస్తూ విరుచుకుపడుతుంటారు. కానీ ఏనాడూ ఇరువురు నేతలు స్పందించలేదు. మరోవైపు పట్టాభిరామ్ పైనా ఒకప్పుడు ఆర్జీవీ ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణపైనా వర్మ దిమ్మతిరిగేలా ట్విటర్ దాడి చేశారు. మళ్లీ వర్మ దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ ట్విటర్ యుద్ధానికి పిలుపునిచ్చారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.