పోలవరం ప్రాజెక్టు : సీఎం జగన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ

పోలవరం ప్రాజెక్టు అంశంలో కేంద్రంతో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని కేవీపీ రామచంద్రరావు సీఎం జగన్‌ను కోరారు.

Update: 2023-03-14 12:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అంశంలో కేంద్రంతో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. ఈ మేరకు కేవీపీ రామచంద్రరావు మంగళవారం సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఈ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని దివంగత సీఎం వైఎస్ఆర్ పరితపించేవారని గుర్తు చేశారు. మీ తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మెళికలు పెట్టే అవకాశం ఉందని దానిపట్ల అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారం కేంద్రంపై పడకుండా, పోలవరం ఎత్తు కుదించి ప్రాజెక్టు ఖర్చునే తగ్గించేలా, కేంద్రం ప్రణాళికలు రచించే అవకాశం ఉందని కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. కాబట్టి పోలవరం నిర్మాణం ప్రస్తుతం రాష్ట్రం చేతిలోనే ఉన్నందున, పోలవరం ఎత్తు తగ్గించడానికి కేంద్రం ఎంత వత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలనో, భూసేకరణ, పునరావాస-పునర్నిర్మాణాలకు పెద్దమొత్తంలో కావల్సిన నిధులనో కారణంగా చూపినా, ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించవద్దని లేఖలో కేవీపీ రామచంద్రరావు సూచించారు.

వైఎస్ఆర్ కల జాప్యం కావడం బాధిస్తోంది

పోలవరం ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ముందుకు సాగడం లేదని.. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎప్పటికీ పూర్తి అవుతుందో ప్రభుత్వ వర్గాలే చెప్పలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరం పూర్తి అయితే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకి అందించి, ఆ మేరకు కృష్ణా నదిలో మిగిలిన జలాలతో రాయలసీమ జిల్లాల రైతులు, కుడి కాలువ క్రింద పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైతులు, ఎడమ కాలువ క్రింద తూర్పు గోదావరి, విశాఖలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు ఆనందంగా పంటలు పండించుకొనే రోజు వస్తుందని తెలిపారు.

ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలని దివంగత సీఎం వైఎస్ఆర్ కలలు కనేవారని అయితే ఆ కల నెరవేరడం అంతకంతకూ జాప్యం కావడం బాధ కలిగిస్తోందన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు, పోలవరాన్ని పూర్తిగా కేంద్రమే నిర్మించాలి. అయితే ప్రధాని మోడీకీ- నాటి సీఎం చంద్రబాబుకు అప్పట్లో ఏమి ఒప్పందం జరిగిందో తెలియదు కానీ.. ప్రాజెక్టు ఖర్చు భారాన్ని కుదించుకుంటూ..ఆర్ధిక భారాన్ని రాష్ట్రంపై మోపుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం మీ ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో ఒక విధానం ప్రకారం ముందుకెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు.

కేంద్రం ఒత్తిడికి తలొగ్గొద్దు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్న నేపథ్యంలో నిధుల విషయంలో గానీ, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల పరిష్కారాల విషయంలో గానీ, ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించే విషయంలో గానీ, కేంద్రం చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భూసేకరణ, పునరావాస-పునర్నిర్మాణ పనులకు అవసరమైన దాదాపు రూ.30,000 కోట్ల ఖర్చుతో తనకు సంబంధం లేనట్లుగానే కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.

ఇదిలా ఉంటే ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ లెవెల్ +140 అడుగులకు కుదించవలసిందిగా కేంద్రం సూచించిందని ప్రచారం జరుగుతుంది. నిధుల కొరత వల్ల రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్రం కండీషన్‌కు అంగీకరించే పరిస్థితి ఉందంటూ వస్తు్న్న వార్తలు కలవరపెట్టిస్తున్నాయని కేవీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి రిజర్వాయర్ లెవెల్ +150 అడుగులు లేకపోతే నీరు నిలువ చేయడం కష్టమన్నారు. ఫలితంగా పోలవరం నుంచి ఆంధ్రులు ఆశిస్తున్న ప్రయోజనాలు నెరవేరవని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా పోలవరం రిజర్వాయర్ లెవెల్ 140-150 అడుగుల మధ్య కాంటూర్‌లోనే, ముంపు గురి అయ్యే ప్రాంతాల ప్రజల పునరావాస-పునర్నిర్మాణ పనులకే పెద్దస్థాయిలో నిధులు కావల్సిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ ఖర్చు భారం నుంచి తప్పించుకోవడానికి కేంద్రం పోలవరం ఎత్తును +140 అడుగులుగా ముగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఖర్చు రాష్ట్రమే పూర్తిగా భరిస్తామని చెప్పినా.. కేంద్రం ఈ ఎత్తు తగ్గించేలా రాష్ట్రం పై వత్తిడి చేసే ప్రమాదముంది అని కేవీపీ సూచించారు.

ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయండి

పోలవరం పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలని, ఈ భారం రాష్ట్రంపై వేయకూడదని నవంబర్ 2017లో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని కానీ ఇప్పటి వరకు దాఖలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఫలితంగా కేసు విచారణ గత ఐదున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం పూర్తి ఖర్చు భాధ్యత..అంటే ప్రాజెక్టు కాస్ట్ ఎస్క్ లేషన్, భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ ఖర్చుతో సహా కేంద్రానిదేనని చెప్పుకొచ్చారు. కాబట్టి భవిష్యత్తులో నాయస్థానాల ఆదేశంతోనైనా పోలవరం పూర్తి ఖర్చు భరించవలసిన అవసరం కేంద్రానికి ఏర్పడవచ్చని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించి భవిష్యత్‌లో కేంద్రం ఆ భారం పడకుండా, పోలవరం ఎత్తు కుదించి ప్రాజెక్టు ఖర్చునే తగ్గించేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేవీపీ రామచంద్రరావు సీఎం వైఎస్ జగన్‌ను లేఖలో కోరారు.

Tags:    

Similar News