సీఎంకు త్వరలో పీకే టీమ్ రిపోర్ట్.. కడప సిట్టింగుల్లో సర్వే టెన్షన్!
వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళుతున్న వైసీపీ అధినేత సొంత జిల్లాలో పట్టు సడలకూడదనే లక్ష్యం పెట్టుకున్నారు.
దిశ ప్రతినిధి, కడప: వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళుతున్న వైసీపీ అధినేత సొంత జిల్లాలో పట్టు సడలకూడదనే లక్ష్యం పెట్టుకున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు పార్టీలో లోటుపాట్లు సరిదిద్దుకోవడం, ప్రజల మనోగతం, ఎమ్మెల్యేల పని తీరు, సిట్టింగ్‌లను మార్చే పరిస్థితి ఏమైనా ఉందా! వంటి కోణాల్లో గత కొద్ది రోజులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. పీకే బృందం చేపట్టిన ఈ సర్వే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే రిపోర్ట్ కొద్ది రోజుల్లోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చేరనున్నట్లు సమాచారం. ఈ నివేదికలో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది? కార్యకర్తల అసంతృప్తి సెగ ఎవరికి తగులుతుంది? వంటి అంశాలపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.
ఎమ్మెల్యేల పని తీరే ప్రధానం
జిల్లాలో పీకే టీం నిర్వహిస్తున్న ఈ సర్వే విస్తృతంగా కొనసాగుతుంది. ప్రతి వార్డు, ప్రతి డివిజన్, ప్రతి పంచాయతీలలో ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా! సమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతున్నారా! ప్రభుత్వ పథకాలు అందుతన్నాయా వంటి అంశాలు ఉంటున్నాయి. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సఖ్యంగా ఉంటున్నారా ..వారి పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే తీరు కారణంగా నియోజకవర్గంలో నష్టపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ? ఒకవేళ సిట్టింగ్ మార్చాల్సి వస్తే మీరు చెప్పే పేర్లు ఏంటి ? ఇలా పలు రకాల ప్రశ్నావళితో సర్వే సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతోపాటు మరికొంత మంది నేతలపైనా సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.
కమలాపురంలో ఆ నలుగురిపై ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఎమ్మెల్యేగా ఉన్న కమలాపురం నియోజకవర్గంలో నలుగురిపై సర్వే సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీ రవీంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు నరేన్ రామానుజుల రెడ్డి, జగన్ కు బాబాయి దుర్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సలహాదారుడు రాజోలు వీరారెడ్డి పేర్లు ఈ సర్వేలో వినిపిస్తున్నాయి. కమలాపురం టిక్కెట్టు రవీంద్రనాథ్ రెడ్డికి తిరిగి ఇస్తారన్న అభిప్రాయాలు కొనసాగుతున్నప్పటికీ ఆయన తనయుడు బరిలో ఉంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
నియోజకవర్గంలో ఇటీవల చింతకొమ్మదిన్నె, వెల్లూరు, విరుపు నాయుడిని పల్లె మండలంలో కొందరు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు, వారిలో కొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో ..ఈ అంశాలను కూడా సర్వే టీమ్ పరిగణనలోకి తీసుకుంటుంది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని ల రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది. ఈ అంశాలనూ సర్వే బృందం నమోదు చేసుకున్నట్లు సమాచారం.
బద్వేలుపైనా..
ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వెంకట డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెనే అభ్యర్థిగా నిలబెడతారా లేక అభ్యర్థిని మారుస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ తరుణంలో ఆ నియోజకవర్గం నుంచి ఆమెతోపాటు సోషియల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటసుబ్బయ్య పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిపై సర్వే జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వే బృందాల నివేదికలు, జగన్ తీసుకోబోయే నిర్ణయాలు సిట్టింగ్ ల్లో గుబులు రేపుతున్నాయి.