పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హౌస్ అరెస్ట్
కాకినాడ జిల్లా తొండంగి సెజ్ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా తొండంగి సెజ్ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. తొండంగి సెజ్‌పై మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పోలీసులు అడ్డుకున్నారు. వర్మను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్సకారులకు మద్దతుగా తొండంగి సెజ్ వద్దకు తనను వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలంలోని పొన్నాడు, రమణక్కపేట , తుని నియోజకవర్గంలో తొండంగి మండలంలోని ఏవీ నగరం, తొండంగి రెవెన్యూ గ్రామాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్యాక్టీరీల నిర్మాణానికి 4072.63 ఎకరాల భూ సేకరణకు సైతం రంగం సిద్ధం చేసింది. అయితే ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మత్స్య సంపద దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మత్స్యకారులతో కలిసి టీడీపీ నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. అంతేకాదు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే.