ఆ మూడు నియోజకవర్గాలపై పవన్ ఫోకస్: త్వరలో అభ్యర్థుల ప్రకటన
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి కంచుకోట.
దిశ, డైనమిక్ బ్యూరో : డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన పార్టీలు సీట్ల సర్ధుబాటుపై మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కోసం కాకినాడలో తిష్టవేసిన సంగతి తెలిసిందే. ఏడు నియోజకవర్గాలలో రాజోలు, పి.గన్నవరం, రామచంద్రాపురం నియోజకవర్గాలు జనసేనకు అమలాపురం, కొత్తపేట, మండపేట,ముమ్ముడివరం నియోజకవర్గాలు టీడీపీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారని.. ఈ రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జనసేన ఖాతాలో ఆ మూడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. శీతాకాలంలో కూడా రాజకీయ వేడి సెగలు కక్కుతుంది. 2024 ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అటు టీడీపీ-జనసేన కూటమి, ఇటు వైసీపీ వ్యూహరచన చేస్తున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలో ముఖ్యంగా డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్ధుబాటు వ్యవహారం ముచ్చెమటలు పట్టిస్తోంది. మూడు నియోజకవర్గాలు జనసేనకు, నాలుగు స్థానాలు టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన ఖాతాలో పి.గన్నవరం, రాజోలు, రామచంద్రాపురం నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుంచి పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పార్టీ పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ లేదా చిక్కాల దొరబాబు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పి.గన్నవరం జాన్‌బాబు పరం?
ఇకపోతే పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గాలి బలంగా వీస్తోంది. ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి లేకపోయినప్పటికీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. జనసేన పార్టీ పట్ల విధేయులు అత్యధికంగా ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన సభ్యత్వాలు సైతం భారీగా నమోదు అయ్యాయి. అంతేకాదు పి.గన్నవరం ఎంపీపీని సైతం తమ ఖాతాలో వేసుకుంది జనసేన పార్టీ. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్ఆర్ఐ, యూఏఈ రీజినల్ కన్వీనర్ పెనుమాల జాన్‌బాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత నాటి ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి సైలెంట్ అయిపోయారు. అలాంటి సమయంలో ఎన్ఆర్ఐ జాన్‌బాబు పి.గన్నవరంపై ఫోకస్ పెట్టారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలతో రాజకీయంగా దూకుడు పెంచారు. అంతేకాదు ఆపదలో ఉన్నామని సంప్రదిస్తే చాలు తానున్నానంటూ అండగా నిలిచారు. దివ్యాంగులకు ఇళ్లునిర్మించి ఇవ్వడంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డబ్బు ఎంతనేది లెక్కవేయకుండా అడిగినంతా ఇచ్చి దానకర్ణుడిలా నిలిచారు. ఇవన్నీ కూడా పవన్ కల్యాణ్ స్ఫూర్తితో చేసినట్లు పెనుమాల జాన్‌బాబు తెలిపారు. అంతేకాదు ఎన్ఆర్ఐ పెనుమాల జాన్‌బాబు పార్టీకి వీరవిధేయుడు. క్రమశిక్షణ కలిగిన నాయకుడు. దుబాయ్‌లో తన ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చి సమావేశాలు నిర్వహించడం గురించి తెలుస్తుంటేనే ఆయనకు పార్టీపట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెనుమాల జాన్‌బాబుకు పి.గన్నవరం నియోజకవర్గంలో అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిసి వచ్చే అవకాశం.
పరిశీలనలో దేవి పేరు
మరోవైపు పెనుమాల జాన్‌బాబు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి పెనుమాల దేవి నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో పెనుమాల దేవి జాన్‌బాబు జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కల్యాణ్ ఆశయాలను తెలియజేస్తుంటారు. అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భర్త వేసిన మార్గంలో పెనుమాల దేవి పయనిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కోటాలో పెనుమాల దేవి జాన్‌బాబు పేరును కూడా పరిశీలనలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో దేవి పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.