ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్.. కఠిన చర్యలకు సిద్ధమంటూ హెచ్చరిక

అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరి వైఖరి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Update: 2024-07-16 02:07 GMT

దిశ ప్రతినిధి, అమరావతి: అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరి వైఖరి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సోమవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం జరిగింది. అది పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ 20 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి నియోజకవర్గ సమస్యల గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

ఎలమంచిలి వరస్ట్..

అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరు పట్ల అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలందర్నీ వాటాల కోసం మామూలు కోసం బెదిరింపులకు దిగుతున్నారని ఇది ఏ మాత్రం సహించరానిదని స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్చుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు విజయ్ కుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసి వేయటం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రాంబిల్లిలో జరుగుతున్న భారత నావికాదళ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బెదిరించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ తీవ్రంగానే మందలించారని తెలిసింది.

పెందుర్తి పరిస్థితి అలాగే ఉంది..

ఎలమంచలి అంత తీవ్రంగా కాకపోయినా పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పినట్టు తెలిసింది. పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాది మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేరిట తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే ఇటు తెలుగుదేశం అధిష్టానానికి అటు జనసేన అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వైఖరిని సహించేది లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.

రౌడీయిజం చేస్తే సహించను..

ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులు అందరితో ఆయన మాట్లాడినప్పుడు రౌడీయిజం చేస్తే సహించేది లేదని, అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదిరించి వచ్చిన వాడినని, బెదిరింపులు, దౌర్జన్యాలు వంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా రౌడీయిజం చేసినా మీరు ఎంతటి వారైనా పార్టీకి మీరంతా రాయల్ అయినా వదులుకోవడానికి సిద్ధం అంటూ హెచ్చరించారు.

ప్రజలు, కార్యకర్తలతో మర్యాదగా ఉండండి..

అప్పుడే కొంతమంది శాసనసభ్యులు పాదాభివందనాలు చేయించుకుంటూ కార్యకర్తలు ప్రజల పట్ల తల బిరుసుగా వ్యవహరిస్తుండటంపట్ల పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ్యులుగా గెలిచిన వారికి సభ్యత సంస్కారం నేర్పాల్సిన అవసరం లేదని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కుటుంబ సభ్యులను వారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదే లేదని, ఎమ్మెల్యేల తరఫున వారు పనులు పైరవీలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. మహిళా నేతల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.


Similar News