రైతులను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోలు చేయకుండా వేధింపులేంటి?: పవన్ ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2023-05-10 09:56 GMT

దిశ,డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనాని అక్కడ నుంచి కారులో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. మెులకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు విని తల్లడిల్లిపోయారు. వేలాది రూపాయలు పంట కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టామని పంట చేతికంది వచ్చిన సమయానికి ఇలా అకాల వర్షాలు తమను నట్టేట ముంచాయని విలపించారు.

మరోవైపు కల్లాల్లో ఎండపోసిన ధాన్యాన్ని సైతం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇదే సమయంలో మెులకవచ్చిన ధాన్యాన్ని రైతులు పవన్ కల్యాణ్‌కు చూపించారు. మెులకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ రైతులను ఓదార్చారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అక్కున చేర్చుకుని ఓదార్చాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెులకెత్తిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారని.. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారని.. అలాగే ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ వెంట పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్ ఇతర నేతలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఆఖరి పోరాటం.. 2024లో ఆ మూడు పార్టీలకూ అగ్ని పరీక్షే!  


Similar News