పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు.. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రెండ్రోజుల్లో ఆయన బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రెండ్రోజుల్లో ఆయన బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్ సైతం కోరినట్లు సమాచారం. ఈ భేటీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై స్పష్టత వచ్చే విధంగా చర్చలు జరుపునున్నారు. కేంద్ర పెద్దలతో చర్చల అనంతరం పొత్తుపై క్లారిటీ వచ్చాక ఉమ్మడి కూటమిగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా, ఇవాళ ఉదయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై అనూహ్యంగా పోటీ చేయబోతున్న రెండు స్థానాలు ప్రకటించారు.
రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ ప్రకటించిన సీట్లకు కౌంటర్‌గా పవన్ కల్యాణ్ స్థానాలు ప్రకటించారని వార్తలు విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమిలో చీలికలు ఏర్పడ్డాయా? అని అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సీట్ల ప్రకటనపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్ ప్రకటించినా తాము మౌనంగా ఉన్నామని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని వివరించారు. చంద్రబాబుకు ఉన్నట్టే నాకూ ఒత్తిడి ఉందన్నారు.
Read More : టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన.. ఒక్కమాటతో తేల్చేసిన జనసేనాని