జనంలోకి జనసేనాని : ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. త్వరలో కీలక సమావేశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారా?

Update: 2023-11-29 07:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారా? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పావులు కదపనున్నారా? ఇప్పటికే టీడీపీతో పొత్తుతో ఫామ్‌లో ఉన్న జనసేనను జెట్ స్పీడ్‌తో ప్రజలకు దూసుకెళ్లేలా వ్యూహరచన చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇక ఫుల్ టైమ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు విరామం ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ప్రజలతోనే ఈ జనసేనాని అని పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు క్యాడర్‌ను సైతం సమాయత్తం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

డిసెంబర్ 1న విస్తృత స్థాయి సమావేశం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది తేల్చుకునే పనిలో పడ్డారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమంటూ గొంతెత్తిన పవన్ కల్యాణ్ ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గం.కు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్‌తోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు విస్తృత స్థాయి సమావేశంల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది.

నాయకులకు దిశానిర్దేశం

ఇదిలా ఉంటే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలి అనేదానిపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా ఎలాంటి విధి విధానాలను అనుసరించాలి అనే అంశాలపై పార్టీ నేతలతో చర్చించి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. అలాగే వారాహి విజయయాత్రకు సంబంధించి మలివిడత ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనేదానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కార్యచరణపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన – టీడీపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీ సమావేశాలు సైతం జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అనంతరం నియోజకవర్గం స్థాయిలో ఇరు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సైతం సమావేశమైన సంగతి తెలిసిందే. అలాగే ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News