వైసీపీని దెబ్బ కొట్టాలంటే గుడ్ బై చెప్పాల్సిందే.. పవన్, లోకేష్ భేటీపై తీవ్ర ఉత్కంఠ..!

Update: 2023-10-21 02:31 GMT

అధికార వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో నిరంతరం ప్రజలను అంటి పెట్టుకొని ఉంటోంది. ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు కేసులపై నిరసనకే పరిమితమవుతున్నాయి. పొత్తు ప్రకటించిన పవన్​కల్యాణ్​ఆ తర్వాత ఓ మూడు రోజులపాటు వారాహి యాత్రతో సరిపెట్టారు. టీడీపీ, జనసేన కలిసి పనిచేసేందుకు సమన్వయ కమిటీలను నియమించాయి. అక్కడ నుంచి ఉమ్మడి కార్యాచరణకు అడుగు ముందుకు పడలేదు. ఈ నెల 23న రాజమండ్రిలో లోకేశ్, పవన్ ఆధ్వర్యంలో కమిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కలిసి పనిచేయాల్సిన అంశాలు, ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నామంటే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఏనాడూ పనిచేసిన దాఖలాల్లేవు. బీజేపీ కేంద్ర పెద్దలు పవన్‌ను పావులా వాడుకుంటున్నారనే భావన జన సైనికుల్లో నెలకొంది. ఎన్నికల్లో బీజేపీతో కలిసే కన్నా టీడీపీతో ముందుకు సాగడమే మంచిదని సేనాని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర సర్కారుపట్ల ఉదాసీన వైఖరితో వైసీపీని ఎదుర్కోవడం వల్ల ఒనగూడే ప్రయోజనం లేదు.

విభజన హామీలు, పెట్రో ధరలు, నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు, విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం, పోలవరం భవితవ్యంపై కేవలం వైసీపీని టార్గెట్​ చేయడం కుదరదు. ఆ రెండు పార్టీల తప్పిదాలను కలిపి ప్రజా బోనులో నిలపకుండా టీడీపీ–జనసేన పైచేయి సాధించడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ, వైసీపీలు ఒకటేనని ప్రజల ముందుంచకుంటే ముస్లిం, క్రిస్టియన్​ఓటర్లను రాబట్టుకోవడం కష్టమంటున్నారు.

ఉమ్మడి కార్యాచరణ అవసరం..

ఎన్నికల నాటికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేరుస్తామనే భరోసాతో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్​ప్రారంభమవుతుంది. విశాఖ స్టీల్​ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ సొంత ఐరన్​ఓర్​గనులను కేటాయిస్తామని హామీనిస్తోంది. నిర్ణీత వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటోంది.

జీఎస్టీని రద్దు చేసి రాష్ట్రాలు సొంతంగా పన్నులు విధించుకునే ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామనే భరోసా ఇస్తోంది. రాహుల్​గాంధీ రాష్ట్రంపై దృష్టి సారిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం లేకపోలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టోను రూపొందించుకోవాల్సి ఉంది.

అస్పష్టత వీడాలి..

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన ఓ స్పష్టతకు రాకుండా వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోలేవు. కర్ర విరగకుండా.. పాము చావకుండా దాగుడు మూతలు ఆడినంత కాలం వైసీపీదే పైచేయి అవుతుంది. నేడు ప్రజల నడ్డివిరుస్తున్న భారాల వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉన్నాయి. కేవలం వైసీపీ సర్కారునే అన్నింటికీ మూలం అని చెబితే ప్రజలు విశ్వసించరు. చీకట్లో ఎన్ని బాణాలు వేసినా ప్రయోజనం ఉండదు.

క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే విధంగా మేనిఫెస్టో ఉండాలి. ఉమ్మడి కార్యాచరణను నిర్దేశించుకోవాలి. ఒకే వేదికపై రెండు పార్టీలు కలిసి పనిచేయడం ద్వారానే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ తేలికవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్, లోకేశ్​తగిన నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ, జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి.

Tags:    

Similar News