త్వరగా కోలుకుంటారని అనుకున్నా.. సీతారాం ఏచూరి మృతి పట్ల పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) మృతి పట్ల జనసేన(Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంతాపం ప్రకటించారు.

Update: 2024-09-12 12:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) మృతి పట్ల జనసేన(Janasena) అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘సీతారం ఏచూరి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసి త్వరగా కోలుకుంటారని భావించాను. ఆయన మరణం బాధాకరం. విద్యార్థి నాయకుడిగా వామపక్ష భావాజాలంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో తన ప్రతి అడుగు పేదలు, బాధితులు, కార్మికుల పక్షాన వేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాటం చేశారు.

ఆ తర్వాత కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువెళ్లారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని అందుకున్నారు. విదేశాంగ విధానంపై, ఆర్థికాంశాలపై, పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారు. ఎస్‌ఎఫ్‌ఐ(SFI) జాతీయ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సీపీఐఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏ పదవిలో ఉన్నా తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. వామపక్ష యోధుడు ఏచూరి మరణం పేదలు, కార్మిక వర్గాలకు తీరనిలోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు.


Similar News