2024 Elections: గోదావరి నుంచే బరిలోకి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కల్యాణ్ హాట్ టాపిక్‌గా మారిపోయారు....

Update: 2023-06-25 12:22 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కల్యాణ్ హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. దీంతో పవన్ పోటీ చేసే నియోజకవర్గం అదిగో ఇదిగో అంటూ రకరకాల ప్రచారం జరిగిపోతుంది. కొంతమంది పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనే మళ్లీ పోటీ చేస్తారని అంటుంటే మరికొందరు తిరుపతి, పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

ఇదే సందర్భంలో పలువురు పవన్ కల్యాణ్‌కు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. తమ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తానంటే భుజాన ఎత్తుకుని మరీ గెలిపించుకుంటానని చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని సామెతను పవన్ కల్యాణ్ ఫాలో అవుతారంటూ చెప్పారు. అంటే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం లేదా గాజువాక నియోజకవర్గాల నుంచి పో టీ చేస్తారా లేక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ మెుదలైంది.

పోటీ ఎక్కడ నుంచో!

2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నాడు పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అనేదానిపై చర్చ జరుగుతుంది. జనసేనాని 2019 ఎన్నికల్ భీమవరం నియోజకవర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రెండో స్థానంలో నిలిచారు. గాజువాకలోనూ పోటీ చేసిన పవన్ కల్యాణ్ 14,520 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గాజువాకలోనూ పవన్ కల్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. అయితే అప్పుడు విడివిడిగా పోటీ చేయడంతో మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థులు నిలిచారు. అయితే పొత్తులో ఎన్నికలకు వెళ్తే ఫలితాలు తారుమారు అవుతాయని పవన్ గెలుపొందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా అన్న సస్పెన్షన్ కొనసాగుతుంది.

మొన్నటి వరకు పిఠాపురం అని

ఇకపోతే వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల నుంచి ఫోకస్ పెట్టాడు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. పిఠాపురం నియోజకవర్గంపై తాను ఫోకస్ పెడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. గెలుపు ఓటములను కూడా నిర్దేశించేది ఈ సామాజికవర్గమే. దీంతో పవన్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారని అందుకే పార్టీ ఆఫీసు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారని అన్నారు. అంతేకాదు పిఠాపురంపై తన పర్యవేక్షణ ఉంటుందని ప్రకటించడం కూడా అందులో భాగమేనని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

హరిరామ జోగయ్య ఏం చెప్పారంటే..

అయితే తాజాగా పవన్ కల్యాణ్‌ రాజకీయ గురువుగా భావించే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొడి హరిరామ జోగయ్య కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురంలలో ఏదో ఒకచోట పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమని సామెతతో భీమవరం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు హరిరామ జోగయ్య చెప్పుకొచ్చారు. మరోవైపు నరసాపురం నియోజకవర్గం పవన్ కల్యాన్ కుటుంబంకు సొంత నియోజకవర్గం అని చెప్పుకొచ్చారు. 2009లో పీఆర్పీ తాడేపల్లిగూడెం స్థానం నుంచి ఘనవిజయం సాధించిందని ఈ 3 స్థానాల్లో ఎక్కడో ఒకచోట పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. చేగొండి హరిరామ జోగయ్య చెప్తే అది నిజం అని జనసైనికులు భావిస్తుంటారు. దీంతో పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే పోటీ చేస్తారనే తెలుస్తోంది.

Tags:    

Similar News