చంద్రబాబు డైలాగులకు పవన్ యాక్టింగ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2022-12-30 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థ తయారయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా? అని సీఎం జగన్ నిలదీశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను చూస్తుంటే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వం మంచి పనిచేస్తుంటే స్వాగతించకుండా దుష్ప్రచారం చేయడం వారికి ఎల్లోమీడియా తోడవ్వడం చూస్తుంటే చెడిపోయిన రాజకీయ వ్యవస్థ కాకపోతే ఇంకేంటని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

మంచి చేస్తు్న్నా దుష్ప్రచారమేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య బంధంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది వెన్నుపోటు అయితే.. పవన్ కల్యాణ్‌ది మోసం అంటూ ధ్వజమెత్తారు. దత్తతండ్రి చంద్రబాబును నెత్తిన పెట్టుకుని దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఊరేగుతున్నారంటూ రెచ్చిపోయారు. చంద్రబాబు డైలాగులకు పవన్ యాక్టింగ్ చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ భార్య కాకపోతే మరో భార్య అన్నట్టుగా పవన్ వ్యవహారం ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ తాను మాత్రం ప్రజలను మాత్రమే నమ్మకున్నానని తెలిపారు. రాజకీయం అంటే షూటింగ్‌లు డైలాగులు కాదని ...డ్రామాలు అంతకన్నా కాదన్నారు. రాజకీయం అంటే నిరుపేదల కుటుంబాల్లో మార్పు తీసుకురావడమేనని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులోభాగంగానే వచ్చే జనవరి నుంచి పెన్షన్లను రూ. 2,750కి పెంచుతామని ప్రకటించామని దానిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రతి 6 నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుందని దానిని తప్పుబట్టి వైసీపీని దెబ్బతీసేందుకు ఎల్లోమీడియా ప్రయత్నిస్తోందంటూ సీఎం జగన్ విరుచుకుపడ్డారు.

పబ్లిసిటీ కోసం 8మందిని బలితీసుకుంటారా?

కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్‌షోలో చోటు చేసుకున్న విషాద ఘటనపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రశ్నించారు. షూటింగ్‌ల కోసం గతంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలితీసుకున్నది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదని... తక్కువగా వచ్చిన జనాలను ఎక్కువగా చూపేందుకు తంటాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. అందరినీ మోసం చేసిన చంద్రబాబు సభలకు జనాలు ఎందుకు వస్తారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఫోటోషూట్, డ్రోన్‌షూట్‌ల కోసం కందుకూరులోని ఇరుకు సందుల్లో రోడ్‌షో పెట్టి అమాయక ప్రజల ప్రాణాలను చంద్రబాబు బలిగొన్నారని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News