Gouthu Sireesha: ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి.. ఆనందంలో పలాస వాసులు
శ్రీకాకులం జిల్లాలోని పలాస వాసులు నీటికోసం పడుతున్న కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది.
దిశ వెబ్ డెస్క్: శ్రీకాకులం జిల్లాలోని పలాస వాసులు నీటికోసం పడుతున్న కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. పలాసాకు తాగు నీరు, సాగు నీరును ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా ఈ ఘటనపై పలాసా ఎమ్మెల్యే గౌతు శిరీష స్పంధించారు. పని చేయించే ప్రభుత్వంలో పనులు ఏవిధంగా సాగుతాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లేనే చూపించిందని పేర్కొన్నారు.
అలానే గత ఐదు సంవత్సరాలుగా పలాసకి ఒక్క చుక్క నీరు సైతం అందిచలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని, అసమర్థ మాజీ మంత్రి అప్పల రాజు కబుర్లతోనే కాలం గడిపారని ఆమె మండిపడ్డారు. కాగా ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపల ఈ రోజు పలాసకు తాగు నీరు, సాగు నీరు అందించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి, ఎంపీ రాంమ్మోహన్ నాయుడుకి, అలానే వారి ఆదేశాల మేరకు చకచకా పనులు చేసి, గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువ జంగిల్ క్లియరెన్స్ చేసి, మొత్తం చెత్తాచెదారాలను తొలిగించి, వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజిలోకి వదిలిన నీరుని ఈ రోజు ఉదయం పలాసకు తీసుకువచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికి పేరుపేరునా పలాస శాసన సభ్యురాలిగా పలాస రైతుల తరుపున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అలానే గత నాలుగు సంవత్సరాలుగా.. మంత్రిని మంత్రిని అంటూ ఈ రోజు ముందు ఒక కారు, వెనక ఒక పోలీసు కారు తిప్పుకోవడం కాదు, ప్రజల మీద శ్రద్ధ ఉంటే ఎలా పని చేయించుకోవాలో ఇప్పుడు చూసి నేర్చుకోండి అని మాజీ మంత్రి అప్పల రాజుపై మండిపడ్డారు. గడిచిన నాలుగేళ్లలో ఎంత సేపు భూ కబ్జాలు చేయడంలో, కాలువలు, కొండలు మింగడంలో ముఖ్యంగా ఓ మహిళ అయిన తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిస్తూ, తనను అగౌరపరచడంలో పొందిన పైశాచిక ఆనందంపై పెట్టిన శ్రద్ధలో కనీసం 10% నీరు అందించడంలో పెట్టుంటే నేడు మీరు అంత ఘోరంగా ఓడిపోయేవారు కారు అని ఆమె మాజీ మంత్రి అప్పల రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అని తాను చెప్పిన నినాదాలపై నమ్మకంతో తనని గెలిపించిన పలాస ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇచ్చిన మాటను నెలలోపలే నెరవేర్చినందుకు తనకు తృప్తిగా ఉందని తెలిపారు.