CM జగన్ సొంత ఇలాకాలో ఓన్లీ వన్ ఛేంజ్.. ఊపిరి పీల్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నామంటూ నియోజకవర్గ ఇన్చార్జులను నియమిస్తున్నారు.
దిశ, కడప ప్రతినిధి: వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నామంటూ నియోజకవర్గ ఇన్చార్జులను నియమిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల జాబితా విడుదల చేసిన వైసీపీ.. ఇదిగో అదిగో మూడో జాబితా అని ఊరించి గురువారం విడుదల చేసింది. దీంతో కడప సొంత జిల్లాల్లో రెండు, మూడు స్థానాల్లో మార్పులు ఖాయమని ప్రచారం సాగింది.
అయితే మూడో జాబితాలో కడప జిల్లాలో కేవలం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని మాత్రమే మార్చారు. అక్కడి సీటును ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేస్తున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉండడం, ఇదే తరుణంలో మల్లికార్జున్ రెడ్డి పట్ల అధిష్టానం కొంత అసంతృప్తితో ఉండడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
వీరి సీట్లు పదిలమేనా..!
ఉమ్మడి కడప జిల్లాలో సిట్టింగులను మార్చవచ్చనే చర్చల్లో రాజంపేట ప్రధానంగా వినిపించిది. ఆ ప్రకారమే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డిని మార్చారు. అయితే జిల్లాలోని మరి కొన్ని సీట్ల మార్పుపై జోరుగా చర్చ సాగింది. రైల్వేకోడూరు ఎమ్మెల్యేగా కొరముట్ల శ్రీనివాసులు కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటికీ ఒక బై ఎలక్షన్‌తో సహా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయన టికెట్‌కు ఢోకా లేదని అనుచరులు ధీమాగా ఉంటే.. మరో వైపు అక్కడ సరైన అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలు ఉంటాయన్న చర్చలూ సాగాయి. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రఘురామి రెడ్డి పట్ల అధిష్టానానికి ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేకపోయినా ఆయన వయసు రీత్యా మార్పు తథ్యమని భావించారు. ఆ టికెట్‌ను రఘురామి రెడ్డి కుమారుడు నాగిరెడ్డికి ఇవ్వచ్చని అనుకున్నారు. మార్పు జాబితాలో జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్ రెడ్డి పేరు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.
కడపలోనూ కంగారే..
కడప అసెంబ్లీ నుంచి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఆయనతో పాటు దివంగత మాజీ మంత్రి ఖలీల్ భాషా కుమారుడు సోహైల్, మరో నేత అబ్జల్ ఖాన్‌లు కూడా టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మూడో జాబితా అనంతరం అంజాద్ బాషాకే టికెట్ ఖరారు అనే దృఢ సంకల్పం అనుచరుల్లో ఉంది. వీటితోపాటు జమ్మలమడుగుపైనా కొద్ది రోజులుగా సిట్టింగ్‌ను మారుస్తురనే చర్చ సాగుతున్నా సిట్టింగ్ సుధీర్ రెడ్డికే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసే అవకాశాలు ఉంటే అక్కడ సుధీర్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా ఆరు చోట్ల సిట్టింగులపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మూడో జాబితాలో రాజంపేటకు మాత్రమే పరిమితం కావడంతో మిగిలిన వారు ఊపిరి పీల్చుకున్నారు.