ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. అకౌంట్లో రూ.10 వేలు జమ

జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

Update: 2023-10-17 16:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నెల 19వ తేదీన అకౌంట్లలో డబ్బులు జమ చేయనన్నట్లు తెలిపింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. జగన్ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. హెలిపాడ్ కోసం స్థలం సిద్దం చేస్తోండగా.. బహిరంగ సభ కోసం ఎమ్మిగనూరు టౌన్‌లోని వైడబ్ల్యూసఎస్ స్టేడియాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ పర్యటన కోసం 19న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో జగన్ బయల్దేరతారు. ఉదయం 10 గంటలకు ఎమ్మిగనూరులో జరిగే సభలో పాల్గొంటారు. నిధులు విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ సభకు జనాలను తరలించేందుకు అధికారులు బస్సులను ఏర్పాటు చేస్తోన్నారు. లబ్ధిదారులతో పాటు మహిళలను తరలించనున్నారు.

జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి ప్రభుత్వం ప్రతీ ఏడాది రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తోంది. నాయిూ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. గత మూడేళ్లుగా సాయం అందిస్తోండగా.. ఎల్లుండి వరుసగా నాలుగో ఏడాది సొమ్ము జమ చేస్తోన్నారు. సచివాలయం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. 21 నుంచి 61 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. రైస్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.


Similar News