మంత్రి రోజా వ్యవహరిస్తున్న తీరును ఏ మహిళ కూడా హర్షించరు: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా చేసిన వ్యాఖ్యలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా చేసిన వ్యాఖ్యలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. బస్సు యాత్ర చేస్తుంటే ఫ్యాషన్ షోకు వెళ్తున్నారని సెటైర్లు వేయడం దారుణం అన్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్న ఒక మహిళ దేవుడిని దర్శించుకుంటే దానిపై కూడా రోజా సెటైర్లు వేస్తున్నారంటే ఆమె అక్కసు ఎంత ఉందో అర్థమవుతుందని అన్నారు. మంత్రి రోజా వ్యవహరిస్తున్న తీరును ఏపీలో ఏ మహిళ కూడా స్వాగతించరని అన్నారు. భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్యపైనా వైసీపీ రాద్ధాంతం చేయడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక జరిగిన మరణాలన్నీ బోగస్ అంటూ వైసీపీ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. గతంలో వైఎస్ఆర్ మరణించినప్పుడు 1,500 మంది చనిపోయినట్టు వైసీపీ చెప్పిందని అంటే అవన్నీ తప్పుడు లెక్కలేనా అని ప్రశ్నించారు. ఆ మరణాలు బోగస్ మరణాలు అని వైసీపీ అంగీకరించినట్లేనా అని నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్‌తో సంభవించిన మరణాలు బోగస్ అయితే వైఎస్ఆర్ మరణంతో సంభవించిన మరణాలు కూడా బోగస్ అని వైసీపీ ఒప్పుకోవాలని ఎంపీ రఘురామ రాజు డిమాండ్ చేశారు.
ఏం సాధించారని బస్సు యాత్రలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రపైనా ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైర్ల వేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఏం చేశారని సామాజిక సాధికారత బస్సు యాత్ర చేపడుతున్నారని నిలదీశారు. సామాజిక సాధికారత యాత్ర పేరుతో మూడు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టే ముందు ఈ సామాజిక వర్గాలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వైసీపీ నేతలు దళితులు, బీసీలను దారుణంగా చంపేశారని.. దాడులకు పాల్పడ్డారని వారికి సమాధానం చెప్పాలన్నారు. డాక్టర్ సుధాకర్ మరణం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, దళిత యువకుడికి శిరోముండనం కేసు, హెల్మెట్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చంపేయడం, సోదరిని వేధించినందుకు ప్రశ్నించినందుకు బాలుడిని చంపేసిన ఘటనలో నిందితుడికి ఎలాంటి శిక్షలు విధించారో ప్రజలకు తెలియజేసి అనంతరం సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేపట్టాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.