తిరుమల లడ్డూపై రాజకీయం వద్దు : Y. S. Sharmila

Update: 2024-10-02 05:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు తీరు చూస్తే విచారణకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ సరిపోదని..కేంద్ర దర్యాప్తు అవసరమని భావిస్తున్నట్లుగా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన షర్మిల లడ్డూ కల్తీ విషయం వెలుగుచూడగానే దీనిపై సీబీఐ విచారణ జరుపాలని అందరికంటే ముందు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీనే లేఖ రాసిందన్నారు. గవర్నర్ ను కలిసి ఇందుకోసం చొరవ తీసుకోవాలని కోరామని, అలాగే లడ్డూ కల్తీ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి కాంగ్రెస్ లేఖ రాసిందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు జరుపాలన్న కాంగ్రెస్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం పోరాడిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.

అయితే లడ్డూ కల్తీ అంశంపై రాజకీయం చేయవద్దని, మతం రంగు పులుమొద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ముందే చెప్పిందని, కాని ఒకరు శాంతి పూజలని..మరొకరు ప్రాయశ్చిత్తం దీక్షలని..ఇంకొకరు ప్రక్షాళన పూజలంటూ రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ చెప్పినట్లుగానే లడ్డూ కల్తీ అంశాన్ని రాజకీయం చేయెద్దంటూ సుప్రీం కోర్టు కూడా చెప్పడం సంతోషకరమన్నారు. లడ్డూ విషయాన్ని రాజకీయం చేయొద్దని చంద్రబాబు, పవన్, జగన్ కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. 

Tags:    

Similar News