పీఠాధిపతుల కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా మారిపోయిందని పలువురు పీఠాధిపతులు ఆరోపించారు. ఇప్పటికైనా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో టీటీడీ యాజమాన్యం
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా మారిపోయిందని పలువురు పీఠాధిపతులు ఆరోపించారు. ఇప్పటికైనా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో టీటీడీ యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దింపుతామని దేశంలోని పలురాష్ట్రాలకు చెందిన 30మంది పీఠాధిపతులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామని హెచ్చరించారు. ఇకపోతే పలు రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చారు. మహాద్వారం ద్వారా దర్శనానికి పంపించాలని కోరగా అందుకు టీటీడీ భద్రతా సిబ్బంది నిరాకరించింది. పీఠాధిపతులు స్వామి వారి దర్శనానికి వస్తు్న్నట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పుకొచ్చారు. తమ దర్శనం విషయాన్ని టీటీడీకి ఇప్పటికే లేఖ ద్వారా తెలియజేశామని వివరించారు. తమను ఇలా అవమానించడం భావ్యం కాదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీటీడీ భద్రతా సిబ్బంది నిరాకరించడంతో వారంతా అక్కడ నిరసన తెలియజేశారు.
సామాన్యుడికి దర్శనం కరువు
తిరుమలలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయని.. వ్యాపార కేంద్రంలా తిరుమలను మార్చేశారని విజయవాడ శ్రీయోగి పీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వత స్వామి ఆరోపించారు. శ్రీనివాస మంగాపురంలో ఇతర పీఠాధిపతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ధనవంతులకు, రాజకీయ ప్రముఖులకు, బిజినెస్ మ్యాన్‌లకు మాత్రమే స్వేచ్ఛగా స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుందని.. సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. పరిస్థితి ఇలానే ఉంటే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని త్వరలోనే పార్టీ పెడతామని హెచ్చరించారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు. పీఠాధిపతులకు నిత్యం తిరుమలలో అవమానాలే జరుగుతున్నాయని విజయవాడ శ్రీయోగి పీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వత స్వామి వాపోయారు.
ఇవి కూడా చదవండి: