నెల్లూరు సిటీ ఆయనదే....వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన విజయసాయిరెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మళ్లీ అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారా?
దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మళ్లీ అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారా? వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదా? సర్వేలలో అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయా? బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో బెడిసికొట్టడం ఒక కారణం కావొచ్చా? అనిల్ కుమార్ యాదవ్‌కు ధీటైన వ్యక్తి లభించకపోవడంతో ఇక అనిల్ కుమార్ యాదవ్ దిక్కని భావిస్తోందా? మాజీమంత్రి నారాయణను ఢీకొట్టడం ఒక్క అనిల్ కుమార్ యాదవ్ వల్లే సాధ్యమని హైకమాండ్ భావించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్‌కు ఈసారి టికెట్ డౌటేనని ప్రచారం ఉంది. సర్వేలలో సైతం ప్రతికూల ఫలితాలు రావడంతో ఈసారి టికెట్ రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. ఒకప్పుడు అనిల్ కుమార్ యాదవ్‌కు అన్నీ తానై వ్యవహరించిన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వేరు కుంపటి పెట్టడం.. కొడుకుపై విమర్శల దాడికి దిగడంతో ఒకవేళ టికెట్ ఇచ్చినా గెలవడం అసాధ్యమనే ప్రచారం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే వైసీపీ అధిష్టానం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మళ్లీ అనిల్ కుమార్ యాదవ్‌నే బరిలోకి దించాలని భావించింది. ఆర్థిక,అంగ సామర్థ్యుడు అయినటువంటి మాజీమంత్రి నారాయణను ఢీ కొట్టడం ఒక్క అనిల్ కుమార్ యాదవ్‌తోనే సాధ్యమని భావించిన అధిష్టానం ఆయనకే మళ్లీ టికెట్ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. అనిల్ కుమార్ యాదవ్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు.
అభ్యర్థి అనిలే
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వర్షన్ సెంటర్లో నెల్లూరు సిటీకి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో అంతా కలిసి పని చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు. అసంతృప్తులను బుజ్జగించారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అని అలాంటి కంచుకోటలో మళ్లీ పాగా వేయాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీకి ఒరిగేదేమీలేదని చెప్పుకొచ్చారు. వైసీపీని గెలిపించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించారు.ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనిల్ పేరును ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ వెంటేనన్న అనిల్
2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్ అనిల్ కుమార్ యాదవ్‌కు ఇవ్వరనే ప్రచారం జరిగింది. ఈసారి అనిల్ కుమార్ యాదవ్‌కు మెుండి చేయి తప్పదని ప్రచారం నేటికీ జరిగింది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో శుక్రవారం ఉదయం సమీక్షలో అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల బరి నుంచి తనను తప్పుకోమని సీఎం జగన్ ఆదేశిస్తే నిరభ్యంతరంగా తప్పుకుంటానని తెలిపారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారి కోసం కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేరుగా చెప్పినా పర్వాలేదు... ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదని తన విధేయత ప్రకటించారు. ఇలాంటి ప్రకటన చేసిన క్షణాల్లోనే అనిల్ కుమార్ యాదవే అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అసమ్మతికి చెక్ పెట్టేదెలా?
మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మళ్లీ టికెట్ కేటాయించడంతో అసంతృప్తులను ఏవిధంగా బుజ్జగిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య నెలకొన్న అసమ్మతికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు అబ్బాయ్ అనిల్ కుమార్ యాదవ్‌కు అన్నీ తానై వ్యవహరించిన రూప్ కుమార్ యాదవ్ అనంతరం దూరమయ్యారు. ఏకంగా ఇరువురు మధ్య వార్ నెలకొంది. నువ్వెంతంటే నువ్వెతం అని ఒకరినొకరు పరోక్షంగా సవాళ్లు విసురుకున్నారు. అలాగే కొంతమంది కార్పొరేటర్లు సైతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా చక్కదిద్దుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ అసమ్మతిని తొలగించకపోతే వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.