Nara lokesh అలా చేస్తే.. తిరుగులేని శక్తిగా టీడీపీ!

Update: 2023-01-26 17:26 GMT
  • అసమానతల్లేని వ్యవస్థ వైపు అడుగులు
  • లోకేష్​ పాదయాత్ర నినాదం ఇదేనా !
  • సహజ వనరుల వినియోగంలో యవకుల కీలక పాత్ర
  • నిర్బంధ పని విధానంపై పట్టుబడతారా ?

దిశ, ఏపీ బ్యూరో: " సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు నేడు వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయి. ఈ అంతరాలను తగ్గించడమే తెలుగు దేశం లక్ష్యం. రాష్ట్రంలో విస్తారంగా సహజ వనరులున్నాయి. ఈ వనరులు సమానంగా పంపిణీ కావాలి. అందులో యువకులు కీలక పాత్ర పోషించాలి !" అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గణతంత్ర వేడుకల సందర్భంగా వెల్లడించారు. ఇదే లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలను అన్వేషిస్తూ ఆ పార్టీ యువనేత నారా లోకేష్​ యువగళం పేరుతో పాదయాత్ర శుక్రవారం కుప్పంలో ప్రారంభమవుతోంది. ఈసందర్భంగా అటు పార్టీలో, ఇటు ప్రజల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

విభజిత రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి ఆశించిన రీతిలో చోటుచేసుకోలేదు. సగటు ప్రజలపై పన్నుల భారాలు పెరిగి కొనుగోలు శక్తి సన్నగిల్లింది. దీంతో సేవల రంగంపై కూడా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. ఒక్క వ్యవసాయ రంగమే కొడిగట్టిన దీపంలో కొన ఊపిరితో నెట్టుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కొంతమేర మార్కెట్లు కుప్పకూలకుండా తోడ్పాటునిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నారా లోకేష్​ పాదయాత్ర చేపడుతున్నారు. రెండు మూడు నెలల నుంచి లోకేష్​ పలు రంగాల నిపుణులతో చర్చించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిండచానికి ఎలాంటి విధానాలు అమలు చేయాలనే దానిపై కసరత్తు ఆయన ఇచ్చే నినాదాలు ఏమై ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నేటికీ సగానికిపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి ఉంది. మొత్తం 80 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నిధుల కొరత ఉన్నా నదుల అనుసంధానం ద్వారా ప్రతీ ఎకరానికి సాగు నీరందించే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పాదక శక్తిని పెంచడానికి ఏం చేయాలనే దానిపై లోకేష్​ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 70 నుంచి 80 శాతం కౌలు సాగు నడుస్తోంది. ఏటా కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సొంతంగా పంటలు సాగు చేసే చిన్నసన్నకారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. పెట్టుబడులు పెరిగి కౌలుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కీలకమైన ప్రాధాన్యతా రంగాన్ని వదిలేసి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం సాధ్యం కాదు. సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలిసింది.

వ్యవసాయంలో మిగులు వస్తే తప్ప పారిశ్రామిక వృద్ధికి బాటలు పడవు. ప్రతీ గ్రామీణ కుటుంబం ఒక్కసారి కొత్త వస్తువులు కొంటే ఇప్పుడున్న పరిశ్రమలు రెట్టింపు అవుతాయి. అర్బన్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎగుమతి ఆధారిత పరిశ్రమల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజల అవసరాలు తీర్చే వినిమయ సరకులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. కుటీర పరిశ్రమలు పరిఢవిల్లుతాయి. ఇటు వ్యవసాయంలో మిగులు, అటు పారిశ్రామిక రంగంలో వృద్ధి సేవల రంగం విస్తృతం కావడానికి దోహదపడుతుంది. అభివృద్ధి చక్రంలోని ఈ మూడు రంగాలపై లోకేష్​ లోతుగా అధ్యయనం చేసినట్లు సమాచారం.

టీడీపీ అధికారానికి వస్తే పని లేదని అడిగే వాళ్లు ఉండకూడదు. నిరుద్యోగమనేది కనిపించకూడదు. అవసరమైతే నిర్బంధ పని విధానాన్ని కూడా తీసుకొచ్చే యోచన చేస్తామని లోకేష్​ ప్రకటించే అవకాశముంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో కునారిల్లుతున్న 80 లక్షల మంది యువత సుస్థిర ఉపాధికి బాటలు పడినట్లే. సహజ వనరులను వినియోగంలో యువతకు కీలక పాత్ర కల్పించి అద్భుతాలు సృష్టిస్తామని లోకేష్ నినదించనున్నట్లు తెలుస్తోంది. ఇంతటి చిత్తశుద్ధితో కార్యాచరణకు ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరే అవకాశముంది. ఇదే జరిగితే లోకేష్ పాదయాత్రకు ప్రజలు హారతులు పడతారు. ప్రతీ ఒక్కరిలో కొత్త ఆలోచనలకు నాంది పలికినట్లవుతుంది. రాజకీయంగా టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి లోకేష్​ పాదయాత్ర దిక్సూచి అవుతుందని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:  Yuvagalam Lokesh పాదయాత్రపై విజయసాయిరెడ్డి సెటైర్లు


Tags:    

Similar News