ఏపీలో Nara Lokesh పాదయాత్ర పేరు ఇదే
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో గెలుపే పరమావధిగా తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా చుట్టేస్తుంటే... పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని రౌండప్ చేసేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యారు. ఇకపై ప్రజల్లో ఉండేందుకు, టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నారా లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
ఈ పాదయాత్రకు యువగళం పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ పాదయాత్రకు సంబంధించి పోస్టర్, వీడియోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. జనవరి 27 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్ర 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర కొనసాగేలా టీడీపీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.
యువత పాల్గొనాలి
తెలుగుదేశం పార్టీ 'యువ గళం' అనే పేరుతో మరో వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండా నిర్ధారణ ప్రక్రియలో యువతను భాగస్వామ్యం చేసేలా, రాష్ట్ర యువతకు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచేందుకు మార్పును కోరే విధంగా తమ గళాన్ని వినిపించేందుకు ఈ యువగళం దోహదపడుతుందని టీడీపీ వెల్లడించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితలు కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించి పోస్టర్, వీడియోను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలోనే యువగళం జెండాను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. టీడీపీ తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్న క్రమంలో యువగళం కార్యక్రమంలో కూడా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లేవనెత్తాలని పిలుపునిచ్చారు. టీడీపీ తీసుకువచ్చిన యువగళం కార్యక్రమాన్ని యువత ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో ఈ యువగళం జరుగుతుందని ప్రకటించింది. జనవరి 27న టీడీపీ శ్రేణులతో కలిసి నారా లోకేశ్ 400రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 4వేల కిలోమీటర్ల మేర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణించి యువత, ప్రజల సమస్యలు వినిపించేందుకు, వారికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాడేందుకు యువగళం వేదిక కల్పించనున్నారని పార్టీ నాయకత్వం ప్రకటించింది.
ప్రభుత్వంపై నిరసన గళం
ఆంధ్రప్రదేశ్ గత మూడున్నరేళ్ల నుంచి పీడింపడుతోంది. 1.5 కోట్లమందికి పైగా నిరుద్యోగులున్న మన రాష్ట్రంలో ప్రతి 4 రోజులకు ఒకరు నిరుద్యోగ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడుతున్న దుస్థితి. దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రానిది అగ్రస్థానం అని టీడీపీ ఆరోపించింది. గత మూడున్నరేళ్లుగా కీచక పాలనలో రాష్ట్రంలో ప్రతీ 8గంటలకు ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతున్నారు.
డ్రగ్స్, మద్యపాన వినియోగం విషయంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గత మూడేళ్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, యువత భవిష్యత్ అంధకారంగా మారింది అని టీడీపీ ఆరోపించింది. యువతకు రాష్ట్ర అభివృద్ధిలో, చట్ట సభలలో ప్రాతినిధ్యం కరువైంది. రాష్ట్ర జనాభాలో సగభాగమైన యువతకు లోక్‌సభలో కేవలం 12శాతం ప్రాతినిథ్యం మాత్రమే ఉంది అని టీడీపీ విమర్శించింది. లోకేశ్ చేపట్టిన యువగళం కార్యక్రమం రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ తద్వారా ప్రస్తుత పాలనలో ప్రబలంగా ఉన్న ప్రజా సమస్యలపై ఏపీ యువతకు, ఓటర్లకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ యువగళం కొనసాగనుంది అని టీడీపీ స్పష్టం చేసింది.
Read more: