Nara Lokesh : AP High Court లో నారా లోకేశ్‌కు చుక్కెదురు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. నారా లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ మెమోలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును ఏ-14గా చేర్చింది. ఈ క్రమంలో నారా లోకేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నారా లోకేశ్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీకి ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని నారా లోకేశ్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు ఇస్తామని ఏజీ శ్రీరాం తెలిపారు. తాము చట్ట ప్రకారం నడుచుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని కోర్టుకు వెల్లడించారు. 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.
లోకేశ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సైతం కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేశ్‌ను సైతం కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే లోకేశ్‌పై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సీఐడీ లోకేశ్‌ను ఏ-14గా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ ప్రయత్నించినప్పటికీ చుక్కెదురు అయ్యింది. ఇకపోతే అటు తండ్రి చంద్రబాబు నాయుడు ఇటు తనయుడు లోకేశ్‌ల విషయంలో రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం అన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సీఐడీ కార్యచరణ సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేశ్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఐఆర్ఆర్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
ఊరట దక్కేనా?: మరో రెండు కేసుల్లో Nara Lokesh ముందస్తు బెయిల్ పిటిషన్లు