మంగళగిరి నాదే... జగన్ ఓ మూర్ఖుడు,సజ్జల బ్రోకర్: Nara Lokesh
వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్నవారికి, ప్రజలకు అందరికీ తాను న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన లోకేశ్ అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేశ్ మాట్లాడుతూ...మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందుతానని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ప్రజల ఆశీస్సులు చంద్రబాబుకు ఉన్నాయని లోకేశ్ స్పష్టం చేశారు. మరో 6 నెలల్లో కరకట్ట కమల్ హాసన్‌ను ఇంటికి పంపించడం ఖాయం అని లోకేశ్ చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రజల సమస్యలపై ఓడిపోయిన తాను వారికి అండగా నిలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు దగ్గరయ్యాను కాబట్టే ప్రజలతో సెల్ఫీ తీసుకుంటున్నాననని కానీ ఆర్కే తీసుకోగలడా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
పోసానిపై పోరాడుతా
‘నేను ఓ నియంతపై పోరాటం చేస్తున్నా. ఓ పెత్తందారు, వైసీపీ గ్లెబెల్స్ ప్రచారంపై పోరాటం చేస్తున్నా’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపి జర్యలు తీసుకున్నా బాధపడనని కానీ అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కంతేరులో తనకు 14 ఎకరాలు ఉందంటూ పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలపై న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించినట్లు నారా లోకేశ్ వెల్లడించారు. టీడీపీ హయాంలో కానీ ఇతర సమయంలో కానీ ఏనాడూ తాము అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ప్రతీ సంవత్సరం తాము తమ ఆస్తులపై ప్రకటన చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. తమపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు తమ కుటుంబంపైనా నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపోరాటం చేస్తానని లోకేశ్ హెచ్చరించారు. తన తల్లి భువనేశ్వరి, కుమారుడు దేవాన్ష్, తనపైనా అనేక అవినీతి ఆరోపణలు చేశారని వాటిని నిరూపించాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని అన్నారు. ఇకపోతే తనపై నిరాధార ఆరోపణలు చేసిన పోసాని కృష్ణమురళికి రెండు సార్లు లీగల్ నోటీసులు పంపించానని అయితే ఆయన రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అందువల్లో న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
జగన్ ఓ మూర్ఖుడు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాది కాలేజీ లైఫ్, సీఎం జగన్‌ది జైల్ లైఫ్ అంటూ విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లాలంటే తనకు పాస్ పోర్ట్, వీసా ఉంటే చాలు అన్నారు. అదే వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతులు కావాలన్నారు. ఎవరు అవినీతి పరులో ప్రజలకు తెలుసునన్నారు. సీబీఐ కోర్టులో విచారణకు హాజరువుతుంది ఎవరో కూడా ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేశారని చంద్రబాబు ఆరోపించారు. తన తాత, తండ్రి సీఎంగా పనిచేసినా ఏనాడూ అవినీతికి పాల్పడలేదు అని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూర్ఖుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో పత్రికా స్వేఛ్చ లేకుండా పోయిందని అన్నారు . ప్రభుత్వ తప్పిదాలను ఏ మీడియా ఎత్తి చూపినా ఆ ఛానెల్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్ అన్నారు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందన్నారు. విజనరీకి విజన్ ఉంటుందని ప్రిజనరీకి జైలు గురించి మాత్రమే తెలుస్తుందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.