Nara Bhuvaneshwari : టీడీపీలో నారా భువనేశ్వరి యాక్టివ్.. తొలిసారి పార్టీ నేతలతో కీలక సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్‌కు అండగా మిగతా కుటుంబసభ్యులు కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. చంద్రబాబు అరెస్ట్‌తో మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అలాగే మంగళవారం కృష్ణా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానంటూ బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. చంద్రబాబు అరెస్ట్‌తో క్రియాశీలకంగా మారారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. బుధవారం రాజమండ్రిలో టీడీపీ ముఖ్యనేతలతో లోకేష్, భువనేశ్వరి భేటీ అయ్యారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ నేతలతో భేటీ కావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
మంగళవారం జైల్లో చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలిశారు. ఈ సందర్భంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కుటుంబసభ్యులకు బాబు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇవాళ ముఖ్యనేతలతో లోకేష్, భువనేశ్వరి భేటీ నిర్వహిస్తున్నారు. బాబు అరెస్ట్ వార్త తెలియగానే బాలయ్య వెంటనే విజయవాడకు చేరుకున్నారు. మూడు రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. సాయంత్రం బాలకృష్ణ కూడా రాజమండ్రికి చేరుకుని లోకేష్, భువనేశ్వరిని కలవనున్నారు. బాబు జైలు నుంచి వచ్చేంత వరకు ముగ్గురూ కలిసి పార్టీని నడిపించనున్నారని తెలుస్తోంది. బాలయ్య, భువనేశ్వరి యాక్టివ్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో కూడా జోష్ పెరుగుతోంది.
More News : టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే 130 సీట్లు ఖాయం