ప్యాసింజర్ రైళ్లను నిలిపేలా చూడండి.. గుంతకల్లు డీఆర్ఎంకు గ్రామస్థుల వినతి
గతంలో మాదిరిగానే తమ నంచర్ల గ్రామంలో ప్యాసింజరు రైళ్లను యధావిధిగా నిలుపుదల చేయాలని చిప్పగిరి మండల పరిధిలోని నంచర్ల గ్రామస్తులు గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్(డిఆర్ఎం) మనీష్ కుమార్ అగర్వాల్ కు విన్నవించారు.
దిశ, చిప్పగిరి: గతంలో మాదిరిగానే తమ నంచర్ల గ్రామంలో ప్యాసింజరు రైళ్లను యధావిధిగా నిలుపుదల చేయాలని చిప్పగిరి మండల పరిధిలోని నంచర్ల గ్రామస్తులు గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్(డిఆర్ఎం) మనీష్ కుమార్ అగర్వాల్ కు విన్నవించారు. మంగళవారం డబ్లింగ్ పనుల్లో భాగంగా పునరుద్ధరించిన నంచర్ల (మల్లప్ప గేటు) స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంతకల్లు డీఆర్ఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్టేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత మండల వైస్ ఎంపీపీ నర్సింహులు, గ్రామ సర్పంచు భీమలింగ, టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శివలింగ ఆధ్వర్యంలో గ్రామస్తులు డీఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామంలో ఉన్న స్టేషన్ మీదుగా యశ్వంత్ పూర్- విజయవాడ, హుబ్లీ -విజయవాడ, గుంతకల్లు- కాచిగూడ, గుంతకల్లు-డోన్-కర్నూలు ప్యాసింజరు రైళ్ల స్టాపింగ్ ఉండేవన్నారు. దీంతో తమ గ్రామస్తులు ఆయా ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఈ ప్యాసింజరు రైళ్లు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. గత కరోనా సమయంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్ ను నిలిపివేశారన్నారు. తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి వస్తోందన్నారు. డబుల్ లైన్ పనులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికైనా తమ గ్రామ స్టేషన్ లో గతంలో నిలిచే ప్యాసింజర్ రైళ్లను యధావిధిగా నిలుపుదల చేయాలని వారు డీఆర్ఎంకు విన్నవించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దృష్టికి సమస్యను తీసుకెళ్లి, మంత్రి సహకారంతో నంచర్ల మల్లప్పగేటు రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలు నిలుపుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.