ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం భేటీ అయ్యారు.
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం దాదాపు అరగంట పాటు సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును ఏపీ కేబినెట్‌లోకి తీసుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై తాజాగా ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? అనే అంశంపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది.
త్వరలో మంత్రివర్గ విస్తరణ
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శాఖలు జనసేన పార్టీకే చెందిన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. కందుల దుర్గేష్ నుంచి నాగబాబుకు ఆ శాఖలను అప్పగించి దుర్గేష్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న అటవీ శాఖతో పాటు కొల్లు రవీంద్ర వద్ద ఉన్న గనుల శాఖను ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో ప్రధానంగా ఈ శాఖల కేటాయింపు పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.