నా పొత్తు మీతోనే... తోడేళ్లన్నీ ఏకమైనా ఏం చేయలేరు: సీఎం వైఎస్ జగన్

‘సింహం సింగిల్‌గానే వస్తుంది. తోడేళ్లన్నీ ఏకమైనా ఏమీ చేయలేరు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Update: 2023-11-17 08:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘సింహం సింగిల్‌గానే వస్తుంది. తోడేళ్లన్నీ ఏకమైనా ఏమీ చేయలేరు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాబోయేది ఎన్నికల సంగ్రామం అని ..ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.కిలో బంగారం ఇస్తామంటారు.. అవి నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ... రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కు కల్పిస్తున్నామని... కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 27లక్షల 42 వేల ఎకరాలకు సంబంధించి16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించ బోతున్నామని సీఎం జగన్ ప్రకటించారు.స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామని.. రెండు విడతల సర్వే పూర్తికాగా మూడో విడత సర్వే ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు.మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం...రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పెత్తందార్లకు పేదలను పిలవడం నచ్చదని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

పేదవర్గాల పట్ట బాధ్యతతో ఉన్నాం

పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 4వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది...సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని...చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం...లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్‌ సర్వీస్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. దళిత వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్మశాసవాటికలకు స్థలాలు కేటాయించాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేస్తున్నాం. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని ప్రారంభిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 10,303 మందికి 12,886.37 ఎకరాల భూమిని శాశ్వత హక్కు అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అంతేకాదు 31 గ్రామాల్లో ఎస్సీ శ్మశాన వాటి­కలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి సీఎం జగన్ మంజూరు చేశారు.

ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదు

తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ తెలిపారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని...ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని వెల్లడించారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌ చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సీఎం జగన్ సూచించారు. ఎస్సీల్లో ఎవరైరా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫస్టోలపై కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అంటూ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి తనకు లేదు అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పేశారు. 

Tags:    

Similar News