Mudragada Padmanabham: కోనసీమ పెద్దలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ

Mudragada Padmanabham Welcomes Ambedkar Name to Konaseema| కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు

Update: 2022-08-08 09:30 GMT

దిశ,ఏపీ బ్యూరో : Mudragada Padmanabham Welcomes Ambedkar Name to Konaseema| కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్‌ అంబేద్కర్ పేరు పెట్టడంపై వివిధ పక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ‌్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

సోమవారం కోనసీమలోని పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. డా.బి.ఆర్ అంబేద్కర్‌ పేరును జిల్లా వాసులు స్వాగతించాలని లేఖలో కోరారు. అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరు పెట్టినందుకు గర్వంగా ఫీలవవ్వాలన్నారు. కాటన్ దొర గోదావరికి ఆనకట్ట కట్టించినందుకు ఇప్పటికీ ఆయనను గౌరవిస్తున్నామని మన దేశంలో పుట్టిన వారికి హక్కులు కల్పించిన అంబేద్కర్‌ను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.

అలజడులు ఆందోళన కలిగిస్తున్నాయి:

కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు, అలజడులపై ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ప్రజలంతా సోదర భావంతో మెలగాల్సిన సమయంలో కులాలు, మతాలు కుంపట్లలో మగ్గిపోతున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పట్టింపులు, మూఢనమ్మకాలతో గొడవలు జరిగేవని, సమాజంలో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఈ అలజడులు చూస్తుంటే మరలా వెనుకటి రోజులకు వెళుతున్నామేమో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. డా.బి.ఆర్ అంబేద్కర్‌ను ఆయన పుట్టిన రాష్ట్రంతో పాటు భారతదేశంతో సహా ప్రపంచమంతటా కొనియాడుతున్నారని అలాంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడం అన్యాయమన్నారు.అంబేద్కర్ పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన ఎవ్వరూ కాదనలేని పరిస్థితి ఉందని, న్యాయంగా అయితే జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని, బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయిన తరువాతే కోనసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు.

అంబేద్కర్ వల్లే మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నాం:

ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరు పెద్దల పేర్లు పెట్టారని, విడిపోయిన తరువాత మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు పెద్దల పేర్లు పెట్జారని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. పేర్లు పెట్టినంత మాత్రాన ఆ జిల్లాలు ఆ పేరుగల వారి ఆస్తులుగా మారిపోవని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు పెట్టినదానికి అభ్యంతరం పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలని కోనసీమ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మహావ్యక్తి పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వపడాలని పిలుపునిచ్చారు. బ్రిటీష్ పాలనలో భారతదేశం ఉన్నప్పుడు కాటన్ దొర ధవళేశ్వరంలో గోదావరికి ఆనకట్ట కట్టించారని వారి విగ్రహాలు గ్రామాలలోను, ఫోటోలు ఇళ్ళలో పెట్టుకుంటున్నారని... వారి కుటుంబ సభ్యులు ధవళేశ్వరం వస్తే అంతా గౌరవిస్తున్నామని గుర్తు చేశారు. పరాయి దేశం వారిని ఇప్పటికి అభిమానిస్తూ, ప్రేమిస్తున్నపుడు ఈ దేశంలో పుట్టి, అందరికి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన డా.బి.ఆర్ అంబేద్కర్‌ను గౌరవించాలా? వద్దో చెప్పాలని కోరారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే మనమంతా స్వేచ్చగా జీవిస్తున్నామన్నది నగ్నసత్యమని వెల్లడించారు. కోనసీమ పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు వివాదాన్ని ముగించి, సమస్యను పరిష్కరించడానికి అన్ని వర్గాలు ముందుకు రావాలని లేఖలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల మహాశాంతి యాత్రను అడ్డుకున్న పోలీసులు

Tags:    

Similar News