ముద్రగడ పద్మనాభంకు వైసీపీ గాలం: పెద్దాపురం నుంచి పోటీ?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

Update: 2023-12-19 12:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ముద్రగడతో చర్చించినట్లు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం పంపినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సైతం సై అన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 2న ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువాకప్పుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

పెదవి విప్పాల్సిందే

ఇకపోతే ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ముద్రగడ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పెద్దాపురం ఇన్‌చార్జి దొరబాబుపై వైసీపీ అధిష్టానం అంతగా సానుకూలంగా లేదని తెలుస్తోంది. దొరబాబు అందర్నీ కలుపుకుపోవడంలో ఫెయిల్ అవుతున్నారని ప్రచారం ఉంది. అంతేకాదు ఐప్యాక్, ఇతర సర్వేలలో కూడా దొరబాబుకు ప్రతికూలంగా రావడంతో ముద్రగడ పద్మనాభంను బరిలోకి దించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలంటే ముద్రగడ పద్మనాభం పెదవి విప్పాల్సి ఉంది.

వైసీపీ అంటే మక్కువ

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభంకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో విడదీయరాని అనుబంధం ఉంది. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌తోనూ సఖ్యతగా మెలుగుతున్నారు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమంలో రైలు దహనం కేసు ఎదుర్కొంటున్న కాపు యువతపై కేసులు ఎత్తివేయడంతో సీఎం వైఎస్ జగన్‌ పట్ల ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటేనే మండిపడుతున్నారు. చంద్రబాబుకు ముద్రగడకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేలా రాజకీయం హీటెక్కింది. అలా అని సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పవన్ కల్యాణ్ స్పందించలేదనే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News