వైసీపీలోకి ముద్రగడ? పోటీ చేసే స్థానం ఇదే..!
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. భవిష్యత్తును త్వరలో ప్రకటిస్తాననడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయన దాదాపుగా వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో జగన్ సమక్షంలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుండి పోటీ చేయాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
దిశ, కాకినాడ : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరి సీటుకు ఎవరు ఎసరు పెడతారో తెలియని సంకట పరిస్థితి నెలకొంది. కాపు ఉద్యమం తరువాత స్తబ్ధతగా ఉన్న కిర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. పాత తరం, కొత్త తరం నేతలతో రాజకీయం చేసిన ఘనత ఆయనది. రాష్ట్రంలో ఆయన ఏదైనా నిరసన కార్యక్రమం చేపడుతున్నారంటే అదొక సంచలనం. కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ తలపెట్టిన కాపు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తుని రైలు దగ్ధం ఘటన కాపు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. ముద్రగడతోపాటు 41 మంది వివిధ కేసుల్లో ఇరుకున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఇటీవల ఆ కేసును రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో ముద్రగడతోపాటు, కాపు నేతలకు క్లీన్ చీట్ లభించింది.
ఈ నెలాఖరుకు క్లారిటీ..
ముద్రగడ పద్మనాభం ఈ నెలాఖరుకు ఏ పార్టీలో చేరతారో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇటీవల పెద్ద ఎత్తున కాపు నేతలు, అనుచరులు, అభిమానులు, ఇతర బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు తరుచూ ఆయనను కలుసుకుంటున్నారు. ఏ పార్టీలోకి చేరతారనే దానిపై స్పష్టత రానప్పటికీ, వైసీపీ సరైన వేదికగా సూచిస్తున్నట్లు తెలిసింది. తెలుగు దేశం పార్టీతో ఆయనకు సరైన సత్ససంబంధాల్లేవు. జనసేన నేతలు ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు జరపలేదు. ఎక్కువగా వైసీపీ నేతలు ముద్రగడకు టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ఆయన రాకకు మార్గం సుగమం చేసినట్లుగా తెలుస్తోంది. పైగా ముద్రగడ రాజకీయ ఆవశ్యకతపై వైసీపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
పిఠాపురం నుండి పోటీ..?
ముద్రగడ పద్మనాభానికి పిఠాపురం మీద అభిమానం ఎక్కువ. ఆయనను కలుసుకుంటున్న నేతలతోపాటు, ఆయన చేపట్టే కార్యక్రమాలకు వెళ్లేవారిలో ఇక్కడి నేతలే ఎక్కువగా ఉంటారు. ఫ్లాట్ ఫాం సిద్ధమైంది.. మీ రాకే ఆలస్యమంటూ ఆయనతో ముచ్చట్లు చేస్తున్నారట. ఇక్కడి నుంచి పోటీచేస్తే గెలుపు సునాయసమని మరికొందరు చెబుతున్నారట. కాగా, నేరుగా ఆయన పోటీలోకి దిగుతారా, లేదా కుమారుడిని రంగంలోకి దింపుతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తమ్మీద వారం రోజులుగా వస్తున్న వార్తలు పిఠాపురంలో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ఆయన నిర్ణయం ఏలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది.
Also Read.