అలజడి సృష్టించేందుకే టీడీపీ దుష్ప్రచారం: Mp Vijayasai Reddy

అలజడి సృష్టిందుకే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు...

Update: 2023-10-14 16:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: అలజడి సృష్టిందుకే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని, నెల రోజులు జైల్లో పూర్తి విశ్రాంతితో ఉండేసరికి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయి కిలో బరువు కూడా పెరిగారని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై జైలు అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారన్నారు. అవినీతి స్కామ్స్‌లో చంద్రబాబుకు బెయిల్ రాకపోయేసరికి టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. తెలుగు డ్రామాల పార్టీ నాటకాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఆరోగ్యస్థితిపై జైలు అధికారులు విడుదల చేసిన అధికారిక నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు,  ప్రత్యేక గతి కేటాయించి, ఇంట్లో వండిన ఆహారం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. బాబు ఆరోగ్య పరిస్థితిని ముగ్గురు డాక్టర్లు రోజుకు మూడు సార్లు పర్యవేక్షణ చేస్తున్నారని, ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తున్నారని తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు జైలు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారన్నారు.

హక్కుగా ఆరోగ్యం

ప్రజల సంతృప్తే ప్రామాణికంగా "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అనారోగ్య బాధితులకు వైద్య పరంగా చేయి పట్టుకొని నడిపించాలి, చెకప్‌లు, శస్త్ర చికిత్సలు, మందులు అన్నింటా అండగా నిలవాలని, అలాగే ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడంపై అవగాహన కల్పించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News