చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో

Update: 2023-10-13 15:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, భద్రతపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని, 5 కేజీల బరువు తగ్గారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. జైల్లో వాటర్‌ట్యాంక్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని, జైల్లో చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని భువనేశ్వరి ఆరోపించారు.

టీడీపీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రత్యేక వైద్యుల బృందం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజూ పరిశీలిస్తుందని తెలిపింది. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ గవర్నర్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తులు ఆందోళన కల్గిస్తున్నాయని, జోక్యం చేసుకోవాలని కోరారు.

చంద్రబాబుకు హనికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో రఘురామకృష్ణంరాజు పొందుపర్చారు. అలర్జీ, డీహైడ్రేషన్ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని, ఐదు కేజీల బరువు కూడా తగ్గారని తెలిపారు. బరువు మరింత తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని లేఖలో పేర్కొన్నారు.


Similar News