ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. న్యూయార్క్ పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని న్యూయార్క్ పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం పలికారు..
దిశ, వెబ్ డెస్క్: న్యూయార్క్(New York)లోని విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తల(Entrepreneurs)తో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్(AP IT Minister Nara Lokesh) సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. బ్లూప్రింట్‌తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పని చేస్తోందని తెలిపారు. 974 కి.మీ.ల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉందని, రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని పారిశ్రామిక వేత్తలకు లోకేశ్ తెలిపారు.
మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయని మంత్రి లోకేశ్ చెప్పారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఎఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఎఐ నిపుణులు తయారవుతారని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను నారా లోకేశ్ ఆహ్వానించారు.