ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట
నరసాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది....
దిశ, వెబ్ డెస్క్ : నరసాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు తనకు రక్షణ కల్పించాలని గురువారం ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం 41-ఏ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎంపీ రఘురామరాజుకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్నేశ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని జడ్జి సూచించారు. ఇక రఘురామకృష్ణం రాజు తరపున న్యాయవాదులు రవి ప్రసాద్, ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.
కాగా రఘురామరాజు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన ఆ పార్టీకి దూరం ఉంటున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ చేసిన తప్పులను బహిరంగంగా విమర్శించారు. ఇప్పటికే జగన్ వైఫల్యాలను తప్పుబడుతూనే ఉన్నారు. అయితే గతంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్‌లో ఆయన ఇంటి ముందు కొందరు రెక్కీ నిర్వహించారు. దాంతో తనపై దాడి చేస్తారేమోనని ఆందోళన చెందారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఆయన సంక్రాంతికి సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లేందుకు రఘురామకృష్ణంరాజు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన అప్రమత్తమయ్యారు. తనపై దాడులు జరిగే అవకాశం ఉందని, తనకు రక్షణ కల్పించాలని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు.