వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఏ పార్టీ నుంచో చెప్పేసిన ఎంపీ రఘురామ

2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.

Update: 2023-11-08 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. వైసీపీ నుంచి పోటీ చేసేది లేదని తేల్చిపారేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో కూడా వెల్లడించారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎంపీ రఘురామ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్‌పై రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ పథకానికి సీఎం జగన్ పేరు లేదా ఆయన తండ్రి పేరు పెట్టడంపై మండిపడ్డారు. చివరికి పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి.. పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్లుగా ముద్రిస్తున్నారని ఎంపీ రఘురామ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వం స్టికర్లు అతికించి ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం రూ.5,300కోట్ల నిధులను నిలిపివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఓవైపు ప్రధాని నరేంద్రమోడీ ఫొటో, మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఫొటో వేసుకుంటే ఇబ్బందేమీ లేదని కానీ కేవలం సీఎం జగన్, ఆయన తండ్రి ఫోటో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే అవేవో తన సొంత జేబులో నుంచి డబ్బు తీస్తున్నట్లు సీఎం జగన్ డప్పుకొట్టుకోవడం ఏంటని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. 

Tags:    

Similar News