దివ్యాంగుల పట్ల ఎంపీ జీవీఎల్ ప్రత్యేక చొరవ:50వేల మందికి లబ్ధి
బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ లోక్‌సభ పార్లమెంట్ పరిధిలోని వైకల్యంతో బాధపడుతున్న సుమారు 50,000 మంది దివ్యాంగులకు మంచి చేసేందుకు ముందుకు వచ్చారు. నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీలలో విడతల వారీగా రోజుకి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దివ్యాంగుల అవసరాల గుర్తింపు కోసం శిబిరాలు నిర్వహించతలపెట్టనున్నారు. ఈ శిబిరాలలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేయనున్నారు. దివ్యాంగుల దైనందిన జీవన శైలి సులభతరం చేసేందుకు ఈ ఉపకరణాలు సహాయపడతాయని ఎంపీ జీవీఎల్ తెలియజేశారు. అంతేకాదు దివ్యాంగులకు డాక్టర్ల బృందంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారికి ఉపకరణాలను అందజేస్తామని ఎంపీ జీవీఎల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో, ప్రధాని నరేంద్రమోడీ సహకారంతో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎలిమ్కో అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని...ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ జరగటం విశాఖపట్నంలో ఇదే మొదటిసారని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఎలిమ్కో సంస్థకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలియజేశారు.