100కి పైగా సైబీరియన్ పక్షులు మృతి
శ్రీ సత్య సాయి జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. సోమవారం అర్థరాత్రి గాలి వాన సృష్టించిన బీభత్సానికి వందల విదేశీ విహంగాలు మృతిచెందాయి. చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్య సాయి జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. సోమవారం అర్థరాత్రి గాలి వాన సృష్టించిన బీభత్సానికి వందల విదేశీ విహంగాలు మృతిచెందాయి. చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 100కి పైగా సైబీరియన్ పక్షులు చెట్ల పైనుంచి కిందపడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వేల కిలోమీటర్ల నుంచి సైబీరియన్ పక్షులు వేసవి విడిది కోసం ఏటా వేల సంఖ్యలో వీరాపురం, వెంకటాపురం పరిసర ప్రాంతాలకు వస్తుంటాయి. అంతేకాదు, ఈ పక్షులకు వందేళ్ల చరిత్ర ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు సరైన రక్షణ చర్యలు తీసుకుని ఉంటే ఇంతటి విషాదం జరిగేది కాదన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఇక్కడే ఉండి సంతాన ఉత్పత్తి చేసుకొని తిరిగి విదేశాలకు తమ పిల్లలతో కలిసి వెళ్తాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో గాలి వాన రావడంతో గ్రామస్తులు వాటికి ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.