YCP Suspension: శ్రీధర్ రెడ్డి, మేకపాటి రియాక్షన్ మామూలుగా లేదుగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు..
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించారని వీరిపై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. వైసీపీ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని స్వాగతించారు.
సస్పెండ్ ఇప్పటికే ఆలస్యమైంది: శ్రీధర్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై సస్పెండ్ చేయడాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వాగతించారు. సస్పెండ్ చేయడం ఇప్పటికే ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. రెండు నెలల తర్వాత సస్పెండ్ చేశారని, ఇంతకు ముందే చేసి ఉన్నా స్వాగతించే వాడినని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు నెలలుగా తాను దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తాను పార్టీకి దూరమవుతున్నట్లు బహిరంగంగా ప్రకటించానని గుర్తు చేశారు. దాంతో తన రూరల్ నియోజవకర్గంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించినట్లు వెల్లడించారు. అయితే సస్పెండ్ చేసే విధానం ఇలాంటిది కాదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తొలుత షోకాజ్ నోటీసు ఇవ్వాలని.. అనంతరం వివరణ తీసుకోవాలని, ఆ వివరణపై సంతృప్తి చెందకపోతే సస్పెండ్ చేయడం ఒక విధానం అన్నారు. కానీ ప్రస్తుతం జరిగిన తీరు అందుకు భిన్నంగా ఉందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్టీలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తుందని, అందులో భాగంగా చేతిలో అధికారం ఉంది కదా అని, తమను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
వెంకటరమణకే ఓటు వేశా: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. తాను వెంకటరమణకే ఓటు వేశానని దేవుడి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. రూ. 20 కోట్లు ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి దేవుడిపై ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని తెలిపారు. వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారని జోస్యం చెప్పారు. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తానని మేకపాటి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి: