రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంత్రి వ్యవహారం
ఓ మంత్రి వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఆ సీనియర్ ఎమ్మెల్యే పనితీరు, వ్యవహారశైలిపై టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన కథనాలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
దిశ, ఏపీ బ్యూరో: ఓ మంత్రి వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఆ సీనియర్ ఎమ్మెల్యే పనితీరు, వ్యవహారశైలిపై టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన కథనాలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. కీలకశాఖకు మంత్రిగా ఉన్న ఆ నేత సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు తెలుగు రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని, అందినకాడికి దోచుకుంటున్నారనే ఘాటు విమర్శలు రావడం ఆపార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి తో సోషల్ మీడియాలో సెర్చింగ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సీఎం కుప్పం టూరు, ప్రధాని వైజాగ్ షెడ్యూల్, డీసీఎం పవన్‌కళ్యాణ్, ఐటీ మినిస్టర్ లోకేష్ పర్యటనలు సైడ్ టాపిక్స్ గా మారాయి.
గతంలోనూ ఆరోపణలు..
ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన ఈ కొద్ది సమయంలోనే ఒక మంత్రిపై భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, అందుకు సంబంధించిన కథనాలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే పత్రికలోనే రావడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. పైగా కేబినెట్‌లోని ఆ కీలక శాఖ మంత్రి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తిని చూపుతున్నారు. సదరు మంత్రిపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని టాక్. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునరుద్ధరించి, సంపద సృష్టించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు పని చేస్తుంటే కీలక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు రావడం విచారకరమని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు.
సీఎం సర్వే చేయించాలి..
మంత్రిపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను సీఎం చంద్రబాబు సొంత సర్వే ద్వారా నిర్ధారించుకోవాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు. సదరు ఆరోపణలు వాస్తవమని రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు చెబుతున్నారు. కూటమిలోని బీసీ మంత్రులపై ఒక వ్యూహం ప్రకారం దుష్ప్రచారం జరుగుతుందని ఇంకొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేతలను ఒక ప్రణాళిక ప్రకారం అవమానిస్తున్నారని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ తర్వాత మంత్రి పార్ధసారధి, గౌతు శిరీషలతో క్షమాపణలు చెప్పించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఈ మంత్రి వ్యవహారం టీకప్పులో తుఫాన్ మాదిరి తేలిపోతుందా? లేదంటే మరింత వివాదాస్పదంగా మారనుందా అనే దానిపై స్పష్టత రావాలంటే ఉగాదికి జరగనున్న మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందేనని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
ఆరోపణల్లేని మంత్రులెవరు ?
ఓ జిల్లాలోని మంత్రి ఎస్సీ కావడంతో అతని వెనుక ఉన్న పెత్తందార్లు ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించారు. పోలీసులతో పాటు ఇతర యంత్రాంగాన్ని గుప్పిట పట్టి కనీసం ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లడానికి అనుమతించడం లేదు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లినా మౌనం వహించడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకొందరు ఓసీ మంత్రులు బరి తెగించి మద్యం వ్యాపారులను బెదిరించి లోబర్చుకుంటున్నా మిన్నకుండిపోయారు. దీనిపైనా స్పందన లేదు. చివరకు సీఎం కుమారుడి శాఖలో అధికారులు దందాలకు పాల్పడుతున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇలాంటి దుర్భర స్థితిలో ఓ బీసీ మంత్రిపై వేటు వేయడానికి సీఎం చంద్రబాబు సాహసిస్తారా? తేలిగ్గా తీసుకుంటారా? అనేది టీడీపీలో చర్చనీయాంశమైంది.