Minister Satya kumar yadav: ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం! మినిస్టర్ సత్య కుమార్ యాదవ్

ఏపీ ప్రభుత్వంపై జగన్ ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

Update: 2024-09-14 11:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై జగన్ ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్.. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,500 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి, అందులో కేవలం 25% శాతం నిధులు అనగా రూ.1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఖర్చు చేసిన నిధుల్లో రూ.700 కోట్ల బకాయిలే ఉన్నాయని అన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే అయిందని, జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి పులివెందులలో హాస్పిటల్ నిర్మాణం మాత్రమే పూర్తి చేశారని, వైద్య కళాశాలల జోలికే వెళ్లలేదని మంత్రి తెలిపారు.

అయితే, రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "రాష్ట్రంలో వైద్యవిద్య అందించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, వాటిని పాటించినప్పుడే ప్రజలకు మెరుగైన వైద్యం అందించగలమని మంత్రి పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో 12 కళాశాలలు రాబోయే సంవత్సరానికి ప్రారంభిస్తామని, అందువలన వైద్యవిద్య కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ దీనిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని వెల్లడించారు.

ఇక, ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే.. గత ప్రభుత్వానికి సంబంధించిన రూ.2500 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో రూ.652 కోట్లను తామే చెల్లించామని మంత్రి అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేల కోట్ల రూపాయలు చెల్లించడం తమకు కష్టమే అయినప్పటికీ.. తాము సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మరో వైపు, సదరన్ సర్టిఫికేట్ల విషయంలో ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే తర్వాత ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినవారి పెన్షన్ లతో పాటు.. వాటిని జారీ చేసిన వైద్య అధికారులపై కూడా తగిన చర్యలుంటాయని ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ హెచ్చరించారు.


Similar News