వీడియోలు బయటపెడతానని మాజీమంత్రి వార్నింగ్... మంత్రి రోజా రియాక్షన్ ఇదే

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపట్ల మంత్రి ఆర్‌కే రోజా స్పందించారు.

Update: 2023-10-02 10:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపట్ల మంత్రి ఆర్‌కే రోజా స్పందించారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గం అన్నారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని..వారిని అవమానించడం క్షమించరాని నేరమని మంత్రి రోజా అన్నారు. సమాజంలో స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలన్నదే తన లక్ష్యం అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్య్రపోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాంతోకలిసి మంత్రి ఆర్‌కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ తిట్టిపోశారు. చంద్రబాబు నాయుడు గాడ్సేకంటే ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని తాను అనడం లేదని గతంలో చంద్రబాబును ఉద్దేశించి దివంగత ఎన్టీఆర్ అన్నారని మంత్రి ఆర్‌కే రోజా గుర్తు చేశారు.

సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుంది

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షను తాను ఖండిస్తున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, జైల్లో ఆయన దీక్ష చేయడమంటే గాంధీజీను అవమానించడమేనంటూ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలు చేస్తున్నారని వాటిని ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కోటి సభ్యత్వం అంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటుందని మరి మోతమోగిద్దాం కార్యక్రమంలో కంచాలు మోగించడానికి జనాలు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఏనాడూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందన్నట్లు టీడీపీ, జనసేన కలిస్తే బూడిదే రాలుతుందని ఎద్దేవా చేశారు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.

Tags:    

Similar News