మాజీ సీఎం జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-06-14 13:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ ఖరారు అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో చంద్రబాబు కేబినెట్‌లో పయ్యావులకు చోటు దక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు శుక్రవారం ఆర్థిక శాఖను కేటాయించారు.

అయితే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసెంబ్లీలో ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా వైఎఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని పయ్యావుల సూచించారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత పీజేఆర్ నివాసానికి వెళ్లి కలిసినట్లు ఈ సందర్భంగా పయ్యావుల గుర్తు చేశారు. అప్పుడే చంద్రబాబులో స్ఫూర్తిని చూశామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబును మాత్రమే అసెంబ్లీలో ఉంచారని ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పుడే చంద్రబాబులో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ ఏంటో తమకు తెలిసిందన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అప్పుడే జగన్‌లో ఉన్న స్ఫూర్తి బయటకు వస్తుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News